CBSE టెన్త్‌ పరీక్షలు రద్దు, 12వ తరగతి ‌‌ వాయిదా..

ఢిల్లీ: సెకండ్‌ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్వీట్‌ చేశారు. “దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జూన్‌ 7 వరకు జరగాల్సిన సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం. బోర్డు తయారు చేసే ఆబ్జెక్టివ్‌, క్రైటీరియా ఆధారంగా విద్యార్థుల పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ప్రస్తుతానికి 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నాం. జూన్‌ 1న పరిస్థితిని సమీక్షించిన తర్వాత 12వ తరగతి ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ పరీక్షలు పెట్టాలనుకుంటే 15 రోజుల ముందుగానే వాటి వివరాలు ప్రకటిస్తాం” అని తెలిపారు.

కోరలు చాస్తున్న కరోనాను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మోదీ చెప్పారని ఈ భేటీకి హాజరైన విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ తెలిపారు. అనంతరం టెన్త్‌ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in ను వీక్షించండి

Flash...   DSC 2008 CANDIDATES SCHEDULE RELEASED