పాఠశాల వివరాల నమోదుకు ఎన్నో యాప్‌లు
టీచర్లపై అదనపు పనిభారం
పాఠం చెప్పేందుకు టైం ఉండటం లేదు.
ఆంధ్రజ్యోతి: ఇప్పుడు స్కూళ్లలో కొత్త సమస్య వచ్చి పడింది. సాంకేతికత సమస్యల పరిష్కారానికి దారి చూపాలి. కానీ అదే సమస్యయి కూచుంది. పాఠశాలల్లో అమలవుతున్న పథకాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యాప్‌లను ఏర్పాటు చేసింది. ఇవి ఒకటో రెండో కాదు. అనేక యాప్‌లను తీసుకువచ్చి ప్రతి వివరం వాటిల్లో పొందుపరచాలని ఆదేశించింది. ఇది ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. దీంతో చదువు చెప్పడానికి టైం చాలడం లేదు.
అసలే కరోనా. విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మొత్తంగానే అకడమిక్ క్యాలెండర్ మారిపోయింది. ఇప్పుడిపుడే రోజూ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ సమయంలో వివిధ రకాల యాప్‌లలో ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. టీచర్లు రోజంతా ట్యాబులతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. ఇంతా చేసి.. పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తున్నారా? అంటే అదీ లేదు. దీనికి ఎన్నో అవరోధాలు. నెట్ స్పీడ్ సరిపోవడం లేదు. సర్వర్ సరిగా పనిచేయడం లేదు. వీటితో యాప్‌ల నిర్వహణ కూడా అరకొరగానే ఉంటోంది. బళ్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపరడమే సరిపోతోంది. బోధనకు టయమే ఉండటం లేదని, యాప్‌ల్లో సమచారం నమోదు చేయడమే సరిపోయిందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. సమయానికి వివరాలు అప్‌లోడ్ చేయకపోయినా, సర్వర్ మొరాయించినా హెచ్‌ఎంలకు ఉన్నతాధి కారులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించాయి.
తప్పని తిప్పలు
యాప్‌లలో సమాచారం నమోదు చేసే బాధ్యత బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో వందలాది ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కనీసం ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులను ఈ పనులకే కేటాయిస్తున్నారు. వారు పాఠశాల సమయమంతా బోధనేతర కార్యక్రమాల్లోనే తలమునకలవుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
యాప్‌లు పదికి పైనే
విద్యార్థులకు, పాఠశాలలకు సంబంధించిన వివరాలను నమోదుకు ఒకటి, రెండు యాప్‌లు ఉంటే సరిపోయేది. కానీ దాదాపు 17 యాప్‌లున్నట్లు ఉపాధ్యాయలు చెబుతున్నారు. విద్యార్థుల హాజరు, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు-నేడు, బడికి పోదాం, జగనన్న విద్యాకానుక, దీక్ష, నిష్ఠ, స్కూల్ ఇన్‌ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం, ఉపాధ్యాయుల సెలవులు, హాజరు, ఇన్‌స్పైర్ మనక్, చైల్డ్ ఇన్‌ఫో వంటి యాప్‌లతో పాటు మరుగుదొడ్ల పరిశీలనకు ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ లాగిన్‌తో గూగుల్ లింక్‌లో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. తాజాగా వంట ప్రదేశం, పాత్రలు, స్టోర్‌రూము, వండిన గుడ్లు, టీఎ్‌సఎం పేరుతో విద్యార్థులు వినియోగించే బాత్‌రూముల ఫొటోలు అప్‌లోడ్ చేయాలంటూ మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టారు.
అదనపు పనిభారం
రోజు రోజుకూ యాప్‌ల సంఖ్య పెరుగుతోంది. ఎప్పటికపుడు మెసేజ్‌లు పెట్టి లింక్‌లు ఇచ్చి వాటికి సమాచారం, ఫొటోలు అప్‌లోడ్ చేయాలంటున్నారు. పాఠశాలల్లో ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు ఆ పని మీదే ఉంటున్నారు. సాంకేతిక సమస్యల వల్ల పనిభారం తప్ప ఫలితం ఉండడం లేదు. – కరుణానిధి మూర్తి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ, పీఆర్‌టీయూ
ప్రభుత్వం ఆలోచించాలి..
యాప్ సమస్యలపై ప్రభుత్వానికి గతంలో విన్నవించుకున్నాం. వీటివల్ల ఉపాధ్యాయలకు ఇబ్బందులే కాకుండా బోధనా సమయం తగ్గిపోయింది. విద్యార్థులు నష్టపోతున్నారు. బోధనకు టైం కేటాయించలేకపోతున్నాం. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. – సతీశ్ కుమార్,
వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడు, బీటీఎఫ్