కరోనా స్పాట్ కేంద్రాలుగా పాఠశాలలు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 8: విద్యా సంస్థల్లో కొవిడ్‌ విస్తరిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో గురువారం ఒక్కరోజే 67 మందికి కరోనా సోకింది. వీరిలో 61 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు 4, ప్రైవేటు ఉపాధ్యాయులు ఇద్దరు బాధితుల్లో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు 33 మంది, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు 9 మందికి వైరస్‌ సోకింది. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో  ఇప్పటివరకు 487 మందికి కొవిడ్‌ సోకింది. 
హాలహర్వి జడ్పీహెచ్‌ఎస్‌, పల్కూరు ప్రభుత్వ ఉర్దూ పాఠశాల, శ్రీశైలం ఎంపీయూపీ పాఠశాలల్లో గురువారం ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. కర్నూలు సంతోష్‌ నగర్‌లోని శ్రీలక్ష్మి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. తాండ్రపాడు, వెల్దుర్తి, పత్తికొండ పాఠశాలలు, గోనెగండ్ల, ఆలూరు, చాగలమర్రి, ఎమ్మిగనూరు, దేవనకొండ, గూడూరు, ప్యాపిలీ కేజీబీవీలు, మిలిటరీ కాలనీ ఎస్సీ హాస్టల్‌, శ్రీశైలం ఎంపీయూపీ పాఠశాల, శ్రీశైలంలోని కొత్తపేట ఎంపీయూపీ పాఠశాల, ఎర్రగుడి ఎంపీపీఎస్‌ పాఠశాల, గోనెగండ్ల ఆదర్శ పాఠశాల, మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లో మొత్తం 33 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. 
కర్నూలు అథేనా పాఠశాల, ఉయ్యాలవాడ బీసీఎస్‌ఆర్‌ కాన్వెంట్‌, నందికొట్కూరు నవనంది రెసిడెన్షియల్‌ పాఠశాల, కర్నూలు ఇండస్‌ పాఠశాల, బనగానపల్లె యాక్సిల్యూమ్‌ విద్యానికేతన్‌, కర్నూలు సెయింట్‌ పాఠశాల, కర్నూలు వీఆర్‌ కాలనీ నారాయణ హైస్కూల్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 14 కేసులు నమోదయ్యాయి. పత్తికొండ, సంజామల, కేజీబీవీల్లోనూ, జూపాడుబంగ్లా, ఏపీడబ్ల్యూఆర్‌ఎస్‌ జూనియర్‌ కళాశాల, తాండ్రపాడు గురుకుల పాఠశాల, కళాశాల, నెరవాడ గురుకుల పాఠశాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు హజీరా కళాశాల, సుంకేసుల రోడ్డు సెయింట్‌ జోసఫ్‌ డిగ్రీ కళా శాల, గుంటూరు జిల్లాలోని మాస్టర్‌ మైండ్స్‌లో చదివే కర్నూలు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఒక్క రోజే 344
 మళ్లీ కొవిడ్‌ ఉధృతి
కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 8: కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. జిల్లాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గురు వారం ఒక్కరోజే 344 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కర్నూలు నగరంలో 147 మంది, నంద్యాల మున్సిపాలిటీలో 49, ఆదోని మున్సిపాలిటీలో 36 మంది వైరస్‌ బారిన పడ్డారు. సంజామల-11, ఉయ్యాలవాడ-3, దొర్నిపాడు-5, మహానంది-3, బనగానపల్లె-8, ఆళ్లగడ్డ-5, శ్రీశైలం-8, ప్యాపిలి-6, నందికొ ట్కూరు-5, కొడుమూరు-6, కొత్తపల్లి-5, గూడూరు-4, సీ.బెళగల్‌-7, బేతంచెర్ల-4 కేసులు వచ్చాయి. ఆదోని డివిజన్‌లోని చిప్పగిరిలో-2, ఆలూరు-4, దేవనకొండ-5, కోసిగి-5, పత్తికొండ-6, తుగ్గలి-3, ఎమ్మిగనూరు-4 కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో బాధితుల సంఖ్య 62,497కు చేరింది. ఇందులో 971 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 61,027 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ బాధితుల్లో ఒకరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 499కి  చేరింది.
కొవిడ్‌ నిబంధనలు పాటించాలి: డీఈవో 
కర్నూలు(ఎడ్యుకేషన్‌): అన్ని పాఠశాలల్లో కరోనా కేసులు అధికమవు తున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కొవిడ్‌ నివారణ చర్యలను తీసుకో వాలని డీఈవో సాయిరాం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జాతరలు, వివాహాలు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు జ్వరం, జలుబు ఉంటే వైద్య పరీక్షల తర్వాతే అనుమతించాలని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులుకు సూచించారు. తరగతిగదిలో మాస్కు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాల న్నారు. తరగతి గదులు, పాఠశాలల లైబ్రరీలు, ప్రయోగశాలలు రోజూ శానిటైజ్‌ చేయాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులను ఇన్‌చార్జిగా నియమించి కరోనా రిపోర్టులను రోజూ ఎంఈవోకి పంపించాలన్నారు.

 

Flash...   CARONA VIRUS: ఈ దేశాల కేసులతో చూస్తే భారతదేశం ఇంకా సురక్షితమైనది అనే చెప్పొచ్చు…!