వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో ‘CBSE’

ఈ విధానంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పు  

ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

ఏపీలో ప్రత్యేకంగా సీబీఎస్‌ఈ కార్యాలయం 

2024–25లో సీబీఎస్‌ఈ విధానంలో టెన్త్‌ బోర్డు పరీక్షలు  

ఈ విధానంపై టీచర్లకు అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలి 

విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు టీచర్లు ఉండాలి 

విద్యా రంగంపై ఇంత ఖర్చు, ఇంత శ్రద్ధ ఎప్పుడూ పెట్టలేదు  

ఇంగ్లిష్ లో బోధించడం, ఇంగ్లిష్ లో మాట్లాడడం అలవాటు చేయాలి  

అంగన్‌వాడీల్లో పీపీ–1లో కూడా ఇంగ్లిష్‌ మాధ్యమం ప్రవేశపెడుతున్నాం 

ఎక్కడ తిన్నా జగనన్న గోరుముద్ద రుచి ఒకేలా ఉండాలి 

అధికారులు పాఠశాలకు వెళ్లినప్పుడు నిర్వహణపై దృష్టి పెట్టాలి

సాక్షి, అమరావతి: విద్యా రంగంలో సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) విధానం విప్లవాత్మక మార్పుగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో (2021–22) అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ రానుందని, 2024–25లో రాష్ట్ర విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో టెన్త్‌ బోర్డు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మన బడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సీబీఎస్‌ఈపై టీచర్లకు అవగాహన కోసం శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలని స్పష్టం చేశారు.

ఒక దార్శనికతతో విద్యా రంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టామని, ఇంత ఖర్చు, ఇంత శ్రద్ధ ఎప్పుడూ పెట్టలేదని అన్నారు. మంచి విద్య అందరికీ అందాలి.. పేద పిల్లలు గొప్పగా చదువుకోవాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయాలన్నీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్‌స్పెక్షన్, మానిటరింగ్‌ పటిష్టంగా ఉండాలని, ఇందు కోసం ఏం చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న సమస్యలకు అధికారులు పరిష్కారాలు కనుక్కోవాలని, ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ కమిషన్‌ మరింత సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. ఏపీలో ప్రత్యేకంగా సీబీఎస్‌ఈ ఒక కార్యాలయాన్ని తెరవనుందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

ఇంగ్లిష్ , తెలుగులో పాఠ్య పుస్తకాలు 

Flash...   Audit Proformas

► పాఠ్య పుస్తకాలను ఇప్పుడు ఇంగ్లిష్, తెలుగులో ఇస్తున్నాం. ఇంగ్లిష్ లో బోధించడం, ఇంగ్లిష్ లో మాట్లాడడం అలవాటు చేయాలి. ప్రారంభంలో తడబాట్లు, తప్పులు ఉంటాయి. కానీ ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మెరుగు పడుతుంది.  

► ఈ అంశాలను టీచర్లకు అర్థమయ్యేలా చేరవేసి వారిలో స్ఫూర్తిని నింపాలి. వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ –1 (పీపీ–1లో) కింద అంగన్‌వాడీల్లో కూడా ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నాం.  

ఎక్కడ తిన్నా ఒకేలా జగనన్న గోరుముద్ద రుచి  

► జగనన్న గోరుముద్దపై వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. తిరిగి అలాంటివి పునరావృతం కాకూడదు. ఎక్కడ తిన్నా కూడా జగనన్న గోరుముద్ద రుచి ఒకేలా ఉండాలి. గోరుముద్ద కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. ఆహార పదార్థాల నాణ్యత ఎక్కడ చూసినా ఒకేలా ఉండాలి.   

► ఆహార పదార్థాలను తయారు చేయడంపై ఎస్‌వోపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) అందుబాటులోకి తీసుకు రావాలి. గోరుముద్ద, టాయిలెట్ల నిర్వహణపై ప్రతి రోజూ స్కూళ్ల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కచ్చితంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలి.  

► ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే దాన్ని సరిదిద్దే వ్యవస్థ ఉండాలి. చిన్న రిపేరు వచ్చినా వెంటనే దాన్ని సరిదిద్దాలి. సమస్య తెలిసిన దగ్గర నుంచీ అది పరిష్కారమయ్యే వరకు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై ఒక ఎస్‌వోపీ ఉండాలి. దీనికి సంబంధించి అధికారులకు అలర్ట్స్‌ రావాలి.   

ఇక పాఠశాలల నిర్వహణపై దృష్టి పెట్టాలి 

► మొదటి దశలో మన బడి నాడు– నేడు కింద పనులు పూర్తయిన పాఠశాలల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో పరిశీలన చేయించాలి. వీరికి సులువుగా అర్థమయ్యేలా నాడు– నేడు పనుల పరిశీలనపై విద్యా శాఖ అధికారులు ప్రశ్నావళి పంపాలి.   

► మన బడి నాడు–నేడు కింద పెద్ద ఎత్తున పనులు చేసినందున, ఇప్పుడు స్కూళ్ల నిర్వహణపై దృష్టి పెట్టాలి. నిర్వహణ సరిగ్గా లేకపోతే ఉపయోగం ఉండదు. ఏప్రిల్‌ 30న తొలి దశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రజలకు అంకితం చేస్తాం. 

Flash...   SBI: ఎస్బీఐ ఖాతాదారులు రూ.342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

► అధికారులు ఎవరైనా పాఠశాలలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా నిర్వహణ ఎలా ఉందన్న దానిపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. టాయిలెట్ల నిర్వహణ బాగుందా? లేదా? అన్న విషయాన్ని తప్పనిసరిగా చూడాలి. 

స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి జగనన్న విద్యా కానుక 

► మళ్లీ స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి కచ్చితంగా పిల్లలకు విద్యా కానుక అందాలి. ఇందులో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదు. (ఈ సందర్భంగా డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగులను సీఎం పరిశీలించారు.)  

► విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు విప్లవాత్మక మార్పులకు దారి తీస్తాయి. ప్రతి ఒక్కరూ నైపుణ్యాన్ని, సమర్థతను పెంచుకుంటారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు, జీతాలు పెరిగి జీవన ప్రమాణాలు మారుతాయి.  

► హాస్టళ్లలో నాడు–నేడు కింద చేపట్టనున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా జవహర్‌ నవోదయ, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో ఉన్న మౌలిక సదుపాయాలు, నాడు –నేడు కింద ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల మధ్య తేడాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  

► మనబడి నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రెండో దశలో చేపట్టాల్సిన పనులు, కార్యక్రమాలపై విద్యా సంస్థల అభివృద్ధి కమిటీలు, అధికారుల శిక్షణా కరదీపికను సీఎం జగన్‌ ఆవిష్కరించారు.   

► జగనన్న గోరుముద్దలో మధ్యాహ్నం నాణ్యమైన భోజనం తయారీ, టాయిలెట్ల నిర్వహణపై ఎస్‌వోపీతో కూడిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. 

► ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రిసెలి్వ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.