న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. పెరుగుతున్నాయని, కరోనా పాజిటివిటీ, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది అని కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
12 రాష్ర్టాలు.. మహారాష్ర్ట, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, బీహార్, హర్యానా రాష్ర్టాల్లో లక్ష చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. 50 వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు 7 రాష్ర్టాల్లో ఉన్నాయి. 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్న రాష్ర్టాలు 17 ఉన్నాయని ఆయన తెలిపారు
13 రాష్ర్టాల్లో రోజుకు వంద మంది చనిపోతున్నారు. మహారాష్ర్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానాలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. రోజువారీ కరోనా కేసుల్లో 2.4 శాతం పెరుగుల ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చాయన్నారు. మహారాష్ర్టలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టకపోతే.. వైద్యసేవల నిర్వహణ మరింత కష్టతరమవుతుందన్నారు.
బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరులో పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. తమిళనాడులో 38 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకు 9 రాష్ర్టాల్లో 6.71 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని లవ్ అగర్వాల్ వెల్లడించారు