ఇంత భారీ స్థాయిలో రహదారుల నిర్మాణమా..? చైనా అసలు వ్యూహమిదేనా..?

‘‘ఒక ప్రాంతానికి రోడ్లు, విద్యుత్ ఇవ్వు. అది ఎందుకు అభివృద్ధి చెందదో చూడు’’అని ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ఈ సూచనను అక్షరాలా అమలు చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది చైనా.. ఈ పేరు చెప్పగానే చౌక ధరకు ఎలక్ట్రానిక్ వస్తువులు, అమెరికాతో పోటీ పడే టెక్నాలజీ, మార్కెట్, మిలటరీ శక్తి గుర్తుకొస్తాయి. వీటితోపాటు చైనాలో భారీగా విస్తరించి ఉన్న ఎక్స్‌ప్రెస్ వేస్ కూడా కచ్చితంగా గుర్తొస్తాయి. ప్రపంచంలో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే రహదారులున్న దేశాల్లో చైనా ఒకటి. ఇక్కడ ఏకంగా 1,60,000 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వేలు ఉన్నాయి. ఇక్కడ ఇంత భారీగా ఎక్స్‌ప్రెస్ వేలు అవసరం ఉన్నాయా? అని అడిగితే చైనా అధికారులు తడుముకోకుండా ‘అవును’ అని సమాధానం చెప్పేస్తారు. ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెస్ వే రహదారులు ఎలా ప్రారంభమయ్యాయి? వీటిని ఇంత భారీగా విస్తరించడానికి కారణాలేంటి? భవిష్యత్తులో చైనా ప్లాన్ ఏంటి? అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే..

డ్రాగన్ దేశం చైనాలో ఒక పాతకాలం సామెత ఉందిట. అదేంటంటే.. ‘‘డబ్బులు సంపాదించాలంటే ముందు ఒక రోడ్డు వేయాలి’’. దీన్ని మోడ్రన్ యుగంలో కూడా చైనా తూచా తప్పకుండా పాటిస్తోంది. కాకపోతే రోడ్లను ఎక్స్‌ప్రెస్ వే రహదారులుగా మార్చుకుంది అంతే. ఇక్కడ 1988లో షాంఘై-జియాడింగ్ మధ్య ఎక్స్‌ప్రెస్ వే రహదారి నిర్మించారు. ఈ రోడ్డు వల్ల ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ వేగం దాదాపు రెట్టింపయింది. అంతకుముందు ఈ రెండు ప్రాంతాల మధ్య పట్టే సమయాన్ని ఈ ఎక్స్‌ప్రెస్ వే దాదాపు సగానికి తగ్గించేసింది. ఇక్కడే వీటి ఉపయోగాలను చైనా పసిగట్టింది. అంతే సాధ్యమైనన్ని ఎక్స్‌ప్రెస్ వే రహదారులు నిర్మించడం ప్రారంభించింది.

 ఎక్స్‌‌ప్రెస్ వే రహదారులు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని చాలా మేర తగ్గిస్తాయని, తద్వారా ప్రజలు, పెట్టుబడులు, సమాచారం, జ్ఞానం అన్నీ వేగంగా ప్రయాణిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా సమయానికి ఎక్కువ విలువ ఇచ్చే బిజినెస్‌మేన్, లాజిస్టిక్స్ సంస్థలకు ఎక్స్‌ప్రెస్ వే వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని వాళ్లు అంటున్నారు. ఈ కనెక్టివిటీతో పాటు సదరు ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి, పట్టణీకరణకు ఈ రహదారులు ఉపయోగపడతాయి. చైనాలో అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్ వే మార్గాలన్నీ ధనిక ప్రాంతాల చుట్టూనే ఉన్నాయని తెలుస్తోంది. అందుకే బీజింగ్, షాంఘై, గాంగ్‌జో వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాల చుట్టూ చైనాలో అత్యధిక ఎక్స్‌ప్రెస్ వే మార్గాలు ఉన్నాయి.

ప్రస్తుతం చైనా ఎక్స్‌ప్రెస్ వే వ్యవస్థ దేశంలోని 98.6 శాతం పట్టణాలను, ప్రాంతాలను కలుపుతోంది. ముఖ్యంగా 2లక్షలపైగా జనాభా ఉన్న ప్రతి ప్రాంతానికీ ఎక్స్‌ప్రెస్ వే మార్గాలున్నట్లు చైనా రవాణా శాఖ తెలిపింది. ఎక్స్‌ప్రెస్ వే విషయంలో తాము ఇక్కడితో ఆగబోమని, లక్షపైన జనాభా ఉన్న ప్రతి ప్రాంతాన్ని ఎక్స్‌ప్రెస్ వే మార్గాలతో కలపడమే తమ లక్ష్యమని అధికారులు అంటున్నారు. ఈ లక్ష్యాన్ని 2035 నాటికి చేరుకుంటామని వాగ్ధానాలు చేస్తున్నారు. ఇది కేవలం రోడ్డు మార్గాల వ్యవస్థే కాదు. ఈ మొత్తాన్ని కలిపి స్మార్ట్ రోడ్ నెట్‌వర్క్ సిద్ధం చేయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల బెయిడో శాటిలైట్ నేవిగేషన్‌ను ఉపయోగించుకోవడం మరింత సులభతరం అవుతుంది. అదే జరిగితే డ్రైవర్ లేని డ్రైవింగ్ సులభతరం అవుతుంది. చైనా వేగం చూస్తుంటే ఈ ఆటోనోమస్ డ్రైవింగ్ చాలా త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు నిపుణులు.

Flash...   18 ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్‌.. కేంద్రం కీలక నిర్ణయం