రాష్ట్రంలో 20 శాతం దాటిన POSITIVITY రేటు.. సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా AP ?

ఆంధ్రప్రదేశ్ కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతుండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఐదు జిల్లాల్లో పరిస్థితులు మరింత భయంకరంగా ఉన్నాయని పేర్కొంది.

రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ వణికిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 18 గంటలపాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నారు. అత్యవసర మెడికల్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వారం నుంచి ఈ నిబంధనలు అమలు అవుతున్నా.. కరోనా మాత్రం అదుపులోకి రాలేదు సరికదా.. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కర్ఫ్యూ వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. మధ్యాహ్నాం 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం అవసరం లేకున్నా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు.

దీంతోనే కరోనా కట్టడి కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కర్ఫ్యూ కన్నా.. లాక్‌డౌనే ఉత్తమమని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్‌కు కూడా అధికారులు ఇదే విషయం చెప్పినట్టు సమాచారం.. సంపూర్ణ లాక్‌డౌన్ లేకుంటే కేసులు అదుపులోకి రావడం కష్టమని భావిస్తున్నారు. కరోనా రెండో దశ వ్యాప్తి ఏపీలో భయానకంగా మారుతుంది. పెరుగుతున్న కేసులు, ఔషధాల కొరత ఇవన్నీ ఒకటైతే.. మరోపక్క వ్యాక్సిన్ల లేమి, ఆసుపత్రులలో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిలువు దోపిడీ ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మహమ్మారి కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ.. ఇప్పటికిప్పుడు అవి ఎంతవరకు ఫలితమిస్తాయన్నదే ఉత్పన్నమవుతోన్న ప్రశ్న. ఏపీలో వైరస్ వ్యాప్తి చాలా ఉదృతంగా కనిపిస్తుంది. ఇక్కడి పరిస్థితిపై వైద్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా శనివారం నిర్వహించిన సమీక్షలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటుంది. కానీ, ఇప్పటికే మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేసింది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షలలో పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే ప్రమాదకరంగా భావించాలి. కానీ, ఏపీలో ఇప్పటికే ఈ రేటు ఇరవై శాతానికి మించింది. పది శాతం దాటితేనే లాక్‌డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. కానీ ఏపీలో మాత్రం పాజిటివ్ రేట్ 20 శాతం దాటుతోంది.

Flash...   Some Exemptions in RC 145 - Teachers should attend to schools

ఏపీలోని 11 జిల్లాలలో పాజిటివిటీ 20 శాతానికి మించగా.. విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. దీంతో మరో 6 నుంచి 8 వారాల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కాకుండా.. లాక్‌డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తుంది. ఏపీలో ఫీవర్ సర్వేలోనూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. చాలా గ్రామాల్లో సగానికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా.. పరీక్షలు చేయించుకోడానికి ముందుకు రావడం లేదని గుర్తించినట్టు సమాచారం. అందరికీ పరీక్షలు నిర్వహిస్తే.. పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.