ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ.. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ.. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిషత్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని న్యాయస్థానం పేర్కొంది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదని హైకోర్టు పేర్కొంది. పరిషత్ ఎన్నికలను సవాల్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కోర్టును ఆశ్రయించాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఫాలో కాకుండా ఎన్నికలు జరిగాయన్న ప్రతిపక్షల వాదనకు హైకోర్టు మొగ్గుచూపింది. అయితే, ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో కానీ, సుప్రీం కోర్టులో కానీ సవాల్ చేసే యోచనలో ఉంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎలక్షన్ కోడ్ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి .. ఏప్రిల్ 8 న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6 వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఎస్.ఈ.సీ అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి..లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైనా సింగిల్ జడ్జి ఈనెల 4 న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు. తాజాగా న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఎన్నికలు రద్దు చేస్తూ.. తీర్పు వెలువరించారు