Breaking: సస్పెన్స్‌కు తెర.. ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా.. ఏపీ
ప్రభుత్వం ప్రకటన.
AP Tenth Exams: సస్పెన్స్‌కు తెరపడింది. ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా
వేసినట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. జూలైలో మరోసారి సమీక్ష జరిపి.. అప్పటి
పరిస్థితుల బట్టి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం
వెల్లడించింది. వాస్తవానికి పదో తరగతి పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి
ఉంది. ఇప్పటిదాకా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ
వచ్చినా.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తాజాగా వాయిదా
వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టగా.. ప్రభుత్వాన్ని వివరణ
కోరింది. దీనితో పది పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి
వివరించింది. ప్రస్తుతానికి స్కూల్స్ తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం
స్పష్టం చేసింది. టీచర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించలేదంటూ ప్రభుత్వం
ఆఫిడివిట్ దాఖలు చేయగా.. పూర్తి వివరాలు కోరుతూ హైకోర్టు తదుపరి విచారణను జూన్
18వ తేదీకి వాయిదా వేసింది.
పదవ తరగతి పరీక్షలు వాయిదా: విద్యా మంత్రి ప్రకటన
విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ 10 వ
తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్
తెలిపారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల
నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని… త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు. ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరమని తెలిపారు. విద్యార్థులు
నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నట్లు మంత్రి
చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందన్నారు.
సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా తాము కోరినట్లు తెలిపారు.
10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు ఉంటాయని.. తల్లిదండ్రులు
ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా కరోనాకు ప్రాణాలు కోల్పోయారన్నారు.
పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్‌కి రావాల్సిన
అవసరం లేదని చెప్పారు.