Covaxin: ఇక నోటి ద్వారా: రెండేళ్ల చిన్నారులకూ టీకా

 Covaxin: ఇక నోటి ద్వారా: రెండేళ్ల చిన్నారులకూ టీకా: రూ.1500 కోట్లు కేంద్రం అడ్వాన్స్. 

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్.. మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కంపెనీల కంటే ముందుగా భారత్ బయోటెక్ తన పరిశోధనల్లో మరింత పురోగతిని సాధించింది. కోవాగ్జిన్ సృష్టికర్తగా గుర్తింపు పొందిన ఈ ఫార్మా కంపెనీ.. ఆ వ్యాక్సిన్‌ను మరింత అభివృద్ధి చేసింది. రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల లోపు వారికి కూడా వ్యాక్సిన్‌ను ఇచ్చేలా దాన్ని రూపొందించింది. ఇప్పటిదాకా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే ఇస్తూ వచ్చిన కోవాగ్జిన్ టీకా.. ఇకపై నోటి (Pediatric) ద్వారా కూడా అందించే వెసలుబాటును తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన పీడియాట్రిక్ క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టడానికి ముహూర్తం కూడా నిర్ణయించింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఈ క్లినికల్ ట్రయల్స్ ఆరంభం కానున్నాయి. పీడియాట్రిక్ ద్వారా కోవాగ్జిన్ టీకాలను వేయడాన్ని చిన్నపిల్లలకు మాత్రమే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. రెండు నుంచి ఆరు లేదా 12 సంవత్సరాల్లోపు వయస్సు వారికి నోటి ద్వారా టీకాలను ఇవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి.

వచ్చేనెలలో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతోన్నామనే విషయాన్ని భారత్ బయోటెక్ బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ఇంటర్నేషనల్ అడ్వొకసీ హెడ్ డాక్టర్ రాఛెస్ ఎల్లా తెలిపారు. ఆల్ అబౌట్ వ్యాక్సిన్ అంశంపై ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించారు. జూన్ 1వ తేదీ నుంచి కోవాగ్జిన్ పీడియాట్రిక్ ట్రయల్స్ నిర్వహించబోతోన్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 700 మిలియన్ల డోసులను వ్యాక్సిన్‌ను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు.

వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 1,500 కోట్ల రూపాయలను అడ్వాన్స్‌గా అందించిందని చెప్పారు. ఈ మొత్తంతో బెంగళూరు, గుజరాత్‌లల్లో వ్యాక్సిన్ ఉత్పాదక కార్యకలాపాలను విస్తరించబోతోన్నామని అన్నారు. కాగా- ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లన్నీ 18 ఏళ్లకు పైనున్న వయస్సు వారికే అందజేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను 12 ఏళ్లకు పైనున్న వయస్సు గల వారికి ఇవ్వడానికి అమెరికా అనుమతి ఇచ్చింది. దీనిపై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదముద్ర తెలిపింది.

Flash...   డిగ్రీ అర్హతతో పోస్టల్ శాఖలో 1899 పోస్టుల భర్తీ.. అర్హులు వీళ్ళే ..