New Vaccine Fight Covid : మరో కొత్త టీకా వచ్చేసింది.. అన్ని కరోనావైరస్‌లను ఒకేసారి అంతం చేయగలదు!
అన్ని కరోనావైరస్ లను ఒకేసారి అంతం చేసే కొత్త టీకా వచ్చేసింది.. కరోనావైరస్ అన్ని జాతులపై ఈ టీకా సమర్థవంతంగా పనిచేయగలదని సైంటిస్టులు గట్టిగా నొక్కిచెబుతున్నారు.
అన్ని కరోనావైరస్ లను ఒకేసారి అంతం చేసే కొత్త టీకా వచ్చేసింది.. కరోనావైరస్ అన్ని జాతులపై ఈ టీకా సమర్థవంతంగా పనిచేయగలదని సైంటిస్టులు గట్టిగా నొక్కిచెబుతున్నారు. కరోనావైరస్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ కొత్త వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని అంటున్నారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బార్టన్ ఎఫ్ హేన్స్ నేతృత్వంలోని సైంటిస్టుల బృందం ఈ కొత్త టీకాను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న అన్ని కరోనా వేరియంట్లు, స్రెయిన్ల జాతులు, గబ్బిలాలకు సంబంధించిన కరోనావైరస్ అన్నింటిపై ఈ టీకా అద్భుతంగా పనిచేస్తోందని చెబుతున్నారు.
ఇప్పటికే ఈ టీకాపై జంతువుల్లో ప్రయోగాలు చేయడం విజయవంతమైందని పేర్కొన్నారు. జంతువులపై పరిశోధనలో భాగంగా కోతులు, ఎలుకలపై ప్రయోగాలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయని, మానవుల్లోనూ ఆశాజనక ఫలితాలే వస్తాయని భావిస్తున్నట్టు సైంటిస్టులు స్పష్టం చేశారు. ఇతర వైరస్‌ల తరహాలోనే కరోనా వైరస్ కూడా మ్యుటేట్ అవుతున్నాయనే అంచనాతో పరిశోధన కార్యక్రమాన్ని మొదలుపెట్టామని చెబుతున్నారు. ఒకప్పటి సార్స్ మహమ్మారిపై జరిగిన పరిశోధనల ఆధారంగా తమ పరిశోధన ముందుకు సాగిందన్నారు.
కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్.. మానవ కణాల్లో గ్రాహకాలకు అనుసంధానం ద్వారా వైరస్ వ్యాప్తిచెందుతోందన్నారు. ఈ ప్రొటీన్‌పై ఉండే ‘రెసెప్టార్ బైండింగ్ డొమైన్’పై సైంటిస్టులు ఫోకస్ పెట్టారు. మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశించడానికి ఈ స్పైక్ అనుమతిస్తుంది. యాంటీబాడీలతో వైరస్‌ను అంతం చేయగల సామర్థ్యం ఉంది. ఈ ‘రెసెప్టార్ బైండింగ్ డొమైన్’లోని ఓ నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకుని యాంటీబాడీలు వైరస్‌పై దాడి చేస్తాయని సైంటిస్టులు తేల్చేశారు.
ఒక నానోరేణువును డిజైన్ చేశారు. శరీర రోగ నిరోధకశక్తిని మరింత పెంచేందుకు పటికతో తయారైన ఒక పదార్థాన్ని ఈ రేణువుకు అతికించారు. దీన్ని కోతుల్లోకి ఎక్కించినప్పుడు కొవిడ్ ఇంజెక్షన్‌ను వంద శాతం నిలువరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు.. వైరస్ ద్వారా శరీరంలో తయారయ్యే యాంటీబాడీల కన్నా ఎక్కువగా ఉత్పత్తి చేసిందని తేల్చారు.