కొత్త స్ట్రెయిన్లు యువకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లలపై కరోనావైరస్ పంజా విసురుతోంది. సింగపూర్‌లో త్వరలో పిల్లలకు టీకాలు వేయనున్నారు.
పిల్లలపై కరోనావైరస్ పంజా విసురుతోంది. సింగపూర్‌లో త్వరలో పిల్లలకు టీకాలు వేయనుంది. కొత్త స్ట్రెయిన్లు యువకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయని అధికారులు హెచ్చరించడంతో సింగపూర్ ప్రధాని లీ హ్సేన్ లూంగ్ ఈ ప్రకటన చేశారు. కరోనా కట్టడి కోసం కఠినమైన లాక్‌డౌన్ కఠినతరం చేసింది.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుర్తించిన కొత్త స్ట్రయిన్లు పిల్లలను ఎక్కువ సంఖ్యలో ప్రభావితం చేస్తున్నాయనే సంకేతాలతో పాఠశాలలను మూసివేస్తున్నట్టు తెలిపారు. 12ఏళ్ల వయస్సు అంతకంటే ఎక్కువ వయస్సు గల పాఠశాల విద్యార్థులకు టీకాలు వేయనున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ నెలలో 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఫైజర్/బయోఎంటెక్ వ్యాక్సిన్‌ను హెల్త్ రెగ్యులేటర్లు ఆమోదించాయి.
గతంలో 16ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే వ్యాక్సిన్ అనుమతి ఉంది. ఇప్పుడు పాఠశాలలు, ట్యూషన్ సెంటర్లలో, పిల్లల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని లీ చెప్పారు. పిల్లల్లో కరోనా తీవ్ర అనారోగ్య సమస్యలేనప్పటికీ, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే విద్యార్థులకు జూన్ సెలవుల సమయంలో టీకాలు వేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.
నగరంలోని 4లక్షల మందికి పైగా విద్యార్థులు టీకాలు వేయించుకోనున్నారు. పాఠశాల పిల్లల తరువాత, అధికారులు 39 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు గల పెద్దలకు టీకాలు వేస్తారు. 5.7 మిలియన్ల జనాభా గల సింగపూర్‌లో చివరిగా చిన్నారులకు టీకాలు వేయనున్నారు.
ప్రణాళిక ప్రకారం.. జూన్ 13 తర్వాత సింగపూర్ ఆంక్షలను ఎత్తివేయనుంది. ప్రపంచ ప్రమాణాల ప్రకారం.. సింగపూర్ మొత్తం వ్యాప్తి స్వల్పంగా ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 62వేల కరోనా కేసులు నమోదుకాగా.. 33మంది కరోనాతో మరణించారు.