కరోనా వచ్చిన తొలిరోజుల్లో కొంత మంది శాస్త్రవేత్తలు ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ వైరస్‌ను చూసి మరీ అంతలా భయపడొద్దని, నెమ్మదిగా ప్రజల్లో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ (సామూహిక నిరోధకత) వస్తుందని వెల్లడించారు. ఇది వస్తే కరోనా వైరస్ బతికే ఉన్నా మనుషులకు సోకడం జరగదని తేల్చేశారు. అయితే ఇది జరగాలంటే మాత్రం కొంత సమయం కావాలి. జనాభాలో అధికశాతం మంది ఈ వైరస్‌ను జయించినప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. అలాంటప్పుడు ప్రపంచ జనాభాలో ఎంత శాతం ఈ వైరస్‌ను జయించాలి? అనేదే ప్రశ్న. దీనికి ఏడాది క్రితం పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. 60 నుంచి 70 శాతం ప్రజలకు కరోనా ఇమ్యూనిటీ వస్తే.. మిగతా వవారిలో ఆటోమేటిక్‌గా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని ప్రకటించారు. అప్పటి నుంచీ ఈ శాతం పెరుగుతూ వస్తోంది
కొంతకాలం భరిస్తే కరోనా మహమ్మారి మాయమైపోతుందని, ప్రపంచం మొత్తం మునుపటి ‘సాధారణ’ స్థితికి చేరుకుంటుందని చాలా మంది భావించారు. కానీ ఇది తప్పని తేలిపోయింది. ఇంకా గట్టిగా మారితే కరోనా అసలు భూమిపై నుంచి పోదని, ఇది ఇక్కడే ఉంటుందనే వాదనకు బలం చేకూరుతోంది. పోలీయో, మీజల్స్ (తట్టు) వంటి వైరసుల్లా ఇది కూడా మన మధ్య శాశ్వతంగా తిష్ట వేసుకునే ప్రమాదం కూడా ఉందిట. మరికొందరు పరిశోధకులు మరో అడుగు ముందుకేసి ఇది సీజనల్ ఫ్లూగా మారే అవకాశం ఉందంటున్నారు. అంటే ఇది ఏటా ఒక టైంలో ఇలా ప్రజలను పట్టి పీడించి వెళ్తుందన్నమాట. కాకపోతే అప్పటికి ప్రజల్లో దీనికి కొంత ఇమ్యూనిటీ వచ్చి పరిస్థితి ఇప్పుడున్నంత భయంకరంగా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా పూర్తిగా నాశనం కావడం కానీ, అంతకుముందు ఉన్న సాధారణ పరిస్థితులకు చేరుకోవడం కానీ అసాధ్యంగానే కనిపిస్తోంది.
కరోనాను పూర్తిగా నిర్మూలించడం కుదరదని ఒక పక్క చెప్తున్న శాస్త్రవేత్తలు, మరోపక్క హెర్డ్ ఇమ్యూనిటీతో దీని రిస్క్ తగ్గుతుందని కూడా అంటున్నారు. అయితే హెర్డ్ ఇమ్యూనిటీ రావడం ఎలా? అనేదే ప్రశ్న. దీనికి జాన్ హాప్‌కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ డౌడీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మానవ చరిత్రలో కొన్ని ప్రాణాంతక వైరసులకు మనుషులు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించారని ఆయన చెప్పారు. దీనికి మశూచి చక్కటి ఉదాహరణ అన్న ఆయన.. ప్రపంచంలో ఇది తొలిసారి వచ్చిన సమయంలో ప్రతి పది మంది అమెరికన్లలో 9 మంది చనిపోయారని, ప్రస్తుతం ఈ వైరస్ చాలా వరకూ అంతమైపోయిందని వివరించారు. 2017లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం 22 మశూచి కేసులు మాత్రమే నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఈ లెక్కన కరోనా మీద కూడా మానవులు గెలుస్తారని, కాకపోతే అత్యధిక శాతం ప్రజలు ఈ వైరస్‌కు ఇమ్యూన్‌గా మారితేనే ఇది జరుగుతుందని తెలుస్తోంది. ఇలా ప్రజల్లో వైరస్ నిరోధకత రెండు మార్గాల్లో పెరుగుతుంది. ఒకటి సహజ ఇన్‌ఫెక్షన్ ద్వారా, రెండు వ్యాక్సిన్ ద్వారా. కరోనాకు ఇమ్యూనిటీ కోసం ఈ రెండు పద్ధతుల్లో కలిపి అధిక శాతం ప్రజలు కరోనాకు ఇమ్యూన్‌గా మారాలని జాన్ డౌడీ తెలిపారు. కానీ ఇటీవల శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిన విషయం ప్రకారం, ప్రపంచంలో ఇప్పటి వరకూ సహజంగా ఇన్‌ఫెక్సన్ ద్వారా కరోనా ఇమ్యూనిటీ కేవలం 20 శాతం మందికే వచ్చిందట. ఇక మన దగ్గర ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.
అయితే కరోనా మ్యూటేషన్ల వల్ల అసలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వ్యాక్సినేషన్ చాలా వేగంగా చేస్తున్న అమెరికాలో కూడా హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన క్రిస్టోఫర్ ముర్రే, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్‌కు చెందిన పీటర్ పియట్ స్పష్టంచేశారు. దీనికి ప్రధాన కారణం కరోనా మ్యూటేషన్లే. బ్రెజిల్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అమెరికా, భారత్.. ఈ దేశాలన్నింటిలో కరోనా వైరస్ మ్యూటేషన్ వెలుగు చూశాయి. ఇంకా తీవ్రమైన విషయం ఏంటంటే.. ఈ మ్యూటేషన్లు వాటికవే కొత్త వైరసుల్లా ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ అనేది అందని ద్రాక్షే అనేది శాస్త్రవేత్తల వాదన.