జూన్‌ నెలాఖరులో కొత్త విద్యా సంవత్సరం! :TS


పాఠశాల విద్యాశాఖ తర్జనభర్జనలు

కరోనా అదుపులోకి వచ్చేవరకు ఆన్‌లైన్‌/డిజిటల్‌ పాఠాలే

గత ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి మొదలు

ఈసారి ముందే ప్రారంభించాలని యోచన 

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ప్రభుత్వ సమీక్షకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: మళ్లీ జూన్‌ వచ్చేస్తోంది. దీంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. కరోనా కేసులు తగ్గిపోతాయా? థర్డ్‌ వేవ్‌ వస్తుందా? జూలై వరకు ఆగాల్సి వస్తుందా? ఎలా ముందుకు సాగాలి? అన్న అంశాలపై తర్జనభర్జనలు పడుతోంది. సాధారణంగా ఏటా జూన్‌ 12వ తేదీన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే కరోనా కారణంగా గతేడాది సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యింది. ఈసారి కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖలో ఆలోచన మొదలయ్యింది.

అన్ని పరిస్థితులూ అనుకూలిస్తే జూన్‌ నెలాఖరులో ప్రారంభించాలన్న అభిప్రాయంతో ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటేనే బోధన ప్రారంభించేందుకు సాధ్యం అవుతుందని, లేదంటే జూలై వరకు ఆగాల్సి వస్తుందేమోనన్న భావనలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే..

రాష్ట్రంలో 40,898 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిల్లో 59,26,253 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి బోధన ప్రారంభించే విష యంలో విద్యాశాఖ పలు ఆలోచనలు చేస్తున్నా.. కరోనా కేసులను బట్టి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారమే ముందుకు సాగనుంది. ప్ర స్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిం చింది. దీంతో లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాతే విద్యా సంవత్సరంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. మార్చి 24వ తేదీనుంచి రాష్ట్రంలో ప్రత్యక్ష విద్యాబోధనను నిలిపివేసిన సమయంలో.. జూన్‌ 1వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించే అవకాశం ఉంది. కరోనా పరిస్థితులపై సమీక్షించి, పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యా బోధనకు సంబంధించిన కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Flash...   గూగుల్‌ పుట్టి నేటికి పాతికేళ్లు.. ఎవరు కనిపెట్టారో తెలుసా..?

ముందుగానే ఆన్‌లైన్‌/డిజిటల్‌ తరగతులు!

కరోనాతో సాధారణ పరిస్థితులు లేకపోవడంతో గతేడాది జూన్‌లో విద్యా బోధన ప్రారంభం కాలేదు. చివరకు సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌/డిజిటల్‌ బోధనను ప్రారంభించింది. అయితే ఈసారి అప్పటివరకు వేచి చూడకుండా ముందు గానే విద్యాబోధనను ప్రారంభించాలన్న ఆలోచనను విద్యాశాఖ చేస్తోంది. కరోనా థర్డ్‌ వేవ్‌ ఉంటుందనే వాదనల నేపథ్యంలో, ప్రత్యక్ష బోధన ప్రారంభించే పరిస్థితులు ఇప్పట్లో నెలకొంటాయన్న ఆశ లేదు. కాబట్టి జూన్‌ నెలాఖరుకు లేదంటే జూలైలో ఆన్‌లైన్‌ /డిజిటల్‌ బోధనను ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాక, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకే ముందుకు సాగనుంది. 

సిద్ధంగా పాఠ్యాంశాలు

డిజిటల్‌/ఆన్‌లైన్‌ బోధనను వచ్చే నెలలో ప్రారంభించినా, ఆ తర్వాత ప్రారంభించినా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అదే పద్ధతిలో బోధన కొనసాగనుంది. ఈ మేరకు అవసరమైన అన్ని డిజిటల్‌/ఆన్‌లైన్‌ పాఠాలు సిద్ధం చేసేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియంలకు చెందిన 1,500కు పైగా వీడియో పాఠాలు ఉన్నాయి. గతేడాది వాటిని టీశాట్, దూరదర్శన్‌ ద్వారా ప్రసారం చేసి బోధనను కొనసాగించింది. చాలావరకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వాటినే విన్నారు.

మరోవైపు పాఠాల కాన్సెప్ట్‌లతో కూడిన 10 వేల వరకు టిక్‌టాక్‌ వీడియోలను (విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యే షార్ట్‌ వీడియోలు) విద్యాశాఖ యూట్యూబ్‌ ఛానెల్‌లో అందుబాటులో ఉంచింది. ఈసారి కూడా అదే పద్ధతిలో ముందుకు సాగాలని విద్యాశాఖ భావిస్తోంది. గతేడాది ఆలస్యంగా ఆన్‌లైన్‌/డిజిటల్‌ విద్యాబోధనను ప్రారంభించిన నేపథ్యంలో సిలబస్‌ 30 శాతం తగ్గించింది. ఈసారి ఒకవేళ ముందుగా ప్రారంభిస్తే ఆ మేరకు వీడియో పాఠాలను సిద్ధం చేయాలని భావిస్తోంది. ఏదిఏమైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు తాము ముందుకు సాగుతామని పాఠశాల విద్యా డైరెక్టర్‌ దేవసేన పేర్కొన్నారు.