న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అయితే వరుసగా మూడో రోజూ కరోనా యాక్టివ్ కేసుల్లో తగ్గుదల కనిపించగా, మరణాలు మాత్రం మరోమారు నాలుగు వేలు దాటాయి. మార్చి మొదటి వారం తర్వాత పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన రోజువారీ కేసులు.. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ 3.5 లక్షలకు లోపే నమోదయ్యాయి. అయితే నిన్నటికంటే కొత్త కేసులు కొద్దిగా పెరగడం ఆందోళనకలిగించే విషయమే..!
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 3.5 లక్షలలోపు కరోనా కేసులు నమోదవడం ఇది వరుసగా రెండో రోజు కావడం విశేషం. యాక్టివ్ కేసులు కూడా మరో నాలుగు వేలు తగ్గడంతో 37 లక్షలకు పడిపోయాయి. ఈ నెల 6న అత్యధికంగా ఒకేరోజు 4,14,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3,29,942 కేసులు రికార్డయ్యాయి.
దేశంలో కొత్తగా 3,48,421 నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,33,40,938కు చేరాయి. ఇందులో 37,04,099 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,93,82,642 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 2,54,197 మంది కరోనాతో మరణించారు. ఇక గత 24 గంటల్లో 4205 మంది మరణించగా, కొత్తగా 3,55,338 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదేవిధంగా 17,52,35,991 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించింది.
ఇక నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు మరో 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్యలో కరోనా బాధితులు మరణించడం ఇదే మొదటిసారి. గత శుక్రవారం అత్యధికంగా 4185 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికంటే 20 మంది అధికంగా మృతిచెందారు. దీంతో గత 14 రోజుల్లో 50 వేల మంది కరోనాతో కన్నుమూశారు. అంటే రోజుకు 3528 మంది చొప్పున చనిపోయారన్నమాట. తాజా మరణాలతో మొత్తం మృతులు 2.5 లక్షలు దాటారు.
దేశంలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు.. పెరుగుతున్న మరణాలు
మహారాష్ట్రలో మరోమారు మరణాలు పెరిగాయి. గత రెండు రోజులుగా 600 కంటే తక్కువగా నమోదవుతుండగా, ఇప్పుడది 793కు చేరింది. తమిళనాడులో 241 నుంచి 298కి పెరిగాయి. ఇలా దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారీ మరణాలు అధికమయ్యాయి.
మొదటి నుంచి అత్యధిక కేసులు నమోదవుతూ వస్తున్న మహారాష్ట్రలో రోజువారీ కేసులు తగ్గుతుండగా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో క్రమంగా అధికమవుతున్నాయి. 26 రాష్ట్రాల్లో 15 శాతం పాజిటివిటీ రేటు ఉండగా, ఈ రాష్ట్రాల్లో మాత్రం 25 శాతం పాజిటివిటీ రేటు నమోదవుతున్నది.