క‌రోనా వ‌చ్చిన వాళ్ల‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేదా.. ఇదీ నిపుణుల మాట‌!


న్యూఢిల్లీ: తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సినేష‌న్ విష‌యంలో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఇందులో ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వాళ్ల‌కు అస‌లు వ్యాక్సినే అవ‌స‌రం లేద‌న్న‌ది కీల‌క పాయింట్‌. ఇది చాలా మంది క‌రోనా పేషెంట్ల‌లో ప‌లు సందేహాల‌కు కార‌ణ‌మైంది. గ‌తంలో క‌రోనా వ‌చ్చిన వాళ్లు మూడు నెల‌ల వ‌ర‌కూ వ్యాక్సిన్ తీసుకోకూడ‌ద‌ని, వాళ్ల‌కు స‌హ‌జంగానే యాంటీబాడీలు ఉంటాయ‌ని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఎయిమ్స్ డాక్ట‌ర్ల‌తో కూడిన నిపుణుల బృందం మాత్రం అస‌లు వారికి వ్యాక్సినే అవ‌స‌రం లేదని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి నిజంగానే కొవిడ్ బాధితుల‌కు వ్యాక్సినేష‌న్ అవ‌స‌రం లేదా? ఒక‌సారి చూద్దాం.

ఎందుకు వ‌ద్ద‌న్నారు?

కొవిడ్ సెకండ్ వేవ్‌లో రీఇన్ఫెక్షన్లు వ‌చ్చిన సంద‌ర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎయిమ్స్ నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో బ్రేక్‌త్రూ ఇన్ఫెక్ష‌న్లు అంటే ఒక డోసు లేదా రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ల‌కూ వైర‌స్ వ‌చ్చిన సంద‌ర్భాలూ ఉన్నాయి. దీని ప్ర‌కారం వ్యాక్సిన్లు క‌రోనా తీవ్ర‌త‌ను త‌గ్గిస్తాయి త‌ప్ప అది పూర్తిగా రాకుండా మాత్రం అడ్డుకోలేవు అని స్ప‌ష్ట‌మైంది.

మ‌రోవైపు ఒక‌సారి క‌రోనా బారిన ప‌డిన వాళ్లు క‌నీసం ప‌ది నెల‌ల వ‌ర‌కైతే మ‌ళ్లీ ఆ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డ‌బోర‌ని లాన్సెట్ జ‌రిపిన మ‌రో అధ్య‌య‌నంలో తేలింది. యూనివ‌ర్సిటీ కాలేజ్ లండ‌న్‌లోని ప‌రిశోధ‌న‌కులు ఈ అధ్య‌య‌నం జ‌రిపారు. వాళ్లు ఒక‌సారి వైర‌స్ బారిన ప‌డిన వాళ్లు, ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా సోక‌ని వాళ్ల యాంటీబాడీ టెస్టింగ్ జ‌రిపారు. దీనిని బ‌ట్టి ఒక‌సారి క‌రోనా బారిన ప‌డిన వాళ్లు ప‌ది నెల‌ల వ‌ర‌కూ సేఫ్ అని తేల్చారు.

అయితే క‌రోనా బారిన ప‌డిన స‌హ‌జంగా యాంటీబాడీలు వృద్ధి అయిన వాళ్ల‌కు వ్యాక్సిన్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న‌డానికి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ఆధారాలు లేవ‌ని మ‌న భార‌తీయ నిపుణుల బృందం అంటోంది. అందుకే వీళ్ల‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు. ఇన్ఫెక్ష్ త‌ర్వాత వ్యాక్సిన్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని తేలిన త‌ర్వాతే వీళ్ల‌కు ఇవ్వాలి అని ఆ నిపుణుల బృందం స్ప‌ష్టం చేస్తోంది. వైర‌స్‌కు అడ్డుక‌ట్ట వేయ‌డ‌మే వ్యాక్సినేష‌న్ ఉద్దేశం అయిన‌ప్పుడు ఇప్ప‌టికే వైర‌స్ బారిన ప‌డిన వాళ్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వొద్ద‌ని వాళ్లు తేల్చి చెప్పారు.

Flash...   Heart Attack : ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..!

నిపుణుల బృందం ఈ సూచ‌న ఇవ్వ‌డానికి ప్ర‌ధానంగా వ్యాక్సిన్ల కొర‌తే కార‌ణంగా క‌నిపిస్తోంది. అంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వ‌డం కంటే ప్రాధాన్య‌తా క్ర‌మంలో ఇవ్వ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ఈ బృందం అంటోంది. అందుకే ఇప్ప‌టికే వైర‌స్ బారిన ప‌డిన వాళ్ల‌ను ప్ర‌స్తుతానికి వ్యాక్సినేష‌న్ నుంచి తొల‌గిస్తే.. పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయ‌ని త‌న నివేదిక‌లో తెలిపింది.