‘COVAXIN ’కు అత్యవసర అనుమతులివ్వలేం: FDA

 


‘COVAXIN ’కు అత్యవసర అనుమతులివ్వలేం: FDA

14 దేశాల్లో అనుమతులొచ్చాయి: భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌, జూన్‌ 11 : భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వలేమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) స్పష్టంచేసింది. టీకా భద్రత, ప్రభావశీలత, రోగ నిరోధక ప్రతిస్పందనకు సంబంధించి తగినంత సమాచారం అందుబాటులో లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టీకాలకు పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసే ‘బయొలాజిక్స్‌ లైసెన్స్‌ అప్లికేషన్‌ (బీఎల్‌ఏ)’ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సిఫారసు చేసింది.

టీకా పనితీరు, ప్రయోగ పరీక్షల అదనపు సమాచారాన్ని కూడా జోడించాలని సూచించింది. ఈమేరకు అమెరికాలో కొవాగ్జిన్‌ టీకా పంపిణీ హక్కులను దక్కించుకున్న ‘ఆక్యుజెన్‌’ కంపెనీకి ఎఫ్‌డీఏ మార్గనిర్దేశం చేసింది. ఈవిషయాన్ని ధ్రువీకరిస్తూ ఆక్యుజెన్‌ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఎఫ్‌డీఏ సిఫారసులపై భారత్‌ బయోటెక్‌ కంపెనీ కూడా స్పందించింది. ‘‘కరోనా టీకాలకు కొత్తగా అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వబోమని గతంలోనే ఎఫ్‌డీఏ ప్రకటించింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే కంపెనీలన్నీ బీఎల్‌ఏ పద్ధతినే అనుసరించాలని కూడా అప్పట్లోనే వెల్లడించింది.

కొవాగ్జిన్‌కు ఇప్పటికే 14 దేశాల్లో ‘అత్యవసర’ అనుమతులు లభించగా, మరో 50కిపైగా దేశాల్లోనూ ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌లో అభివృద్ధిచేసిన లేదా తయారైన ఏ టీకాకూ ఇప్పటిదాకా ఎఫ్‌డీఏ అత్యవసర అనుమతులు కానీ, లైసెన్సులు కానీ లభించలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం కొవాగ్జిన్‌కు లభిస్తే దేశానికి ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది’’ అని భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఎఫ్‌డీఏ నిర్ణయం ప్రభావం వ్యాక్సినేషన్‌ ప్రణాళికపై పడబోదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ వెల్లడించారు

Flash...   AP: ఏపీలో కొవిడ్ కేసులపై హైకోర్టులో విచారణ