CPS రద్దా..వద్దా!


సీపీఎస్‌ రద్దా..వద్దా!

గాలిలో 2 లక్షల మంది పెన్షన్‌ భద్రత.. ఎన్నికల్లో జగన్‌ హామీ అది

వారంలో రద్దు అని చెప్పి రెండేళ్లు.. వచ్చిన ప్రతి సీఎస్‌ వద్దా సమీక్షలు

ఉపసంఘం పరిశీలనలు.. ఇంత కసరత్తు చేసినా నిర్ణయమేది?

కేంద్ర సవరణలూ అమలుచేయరేం?.. నిలదీస్తున్న ఉద్యోగ వర్గాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉద్యోగులపాలిట శాపం సీపీఎస్‌ విధానం. ఈ విధానాన్ని రద్దుచేస్తానని వైఎస్‌ జగన్‌ తన పాద యాత్రలో మచిలీపట్నం నుంచి శ్రీకాకుళం వరకు పదేపదే హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎ్‌సను (కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌) రద్దు చేస్తానని నాడు చెప్పారు. కానీ, రెండేళ్లయినా నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఉద్యోగ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ.   ఈ రెండేళ్లలో ముగ్గురు సీఎ్‌సలు వచ్చారు. సీఎ్‌సల సమీక్షంలో, సీఎం వద్ద సీపీఎస్‌ రద్దుపై ఉన్నతస్థాయిలో పలు దఫాలు చర్చలు కూడా జరిగాయి. ఈ ఉన్నతస్థాయి సమీక్షల్లో ఏ నిర్ణయం తీసుకున్నారో అర్థంకాక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఉద్యోగులకు ఊరటనిచ్చేలా కేంద్రం చేసే సవరణలు కూడా రాష్ట్రంలో అమలుకాని పరిస్థితి! ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌ పరిధిలో ఉన్నారు. వీరిలో నేరుగా ప్రభుత్వఉద్యోగులు 1,78,705 ఉంటే, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 3,295 మంది ఉన్నారు. మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారు.

వారితో పాటు ఆర్టీసీకు చెందిన దాదాపు 52వేలమంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చాలని సీఎం ఆదేశించారు. వీరంతా జాతీయస్థాయిలో సీపీఎస్‌ అమల్లోకివచ్చిన 2004 జూలై1 తర్వాత సర్వీసులోకి వచ్చినవారు. అప్పటిదాకా ఉన్న పెన్షన్‌ విధానంలో… రిటైరయ్యేనాటికి ఉన్న బేసిక్‌ వేతనంలో 50 శాతం పింఛనుగా చేతికి అందేది. పదవీవిరమణ జీవితానికి భద్రత దొరికేది. అయితే, దీనివల్లే తనపై పడే భారాన్ని వదిలించుకోడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిందే సీపీఎస్‌ విధానం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు అదే విధానాన్ని అందిపుచ్చుకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను బయట మార్కెట్‌కు తరలించి.. రిటైర్మెంట్‌ నాటికి అది ఎంత ఉంటుందనేదాన్నిబట్టి పెన్షన్‌ నిర్ణయిస్తారు. నిత్యం హెచ్చుతగ్గులకు గురయ్యే మార్కెట్‌తో ముడిపెట్టడంవల్ల, రిటైర్మెంట్‌ నాటికి ఎంత పెన్షన్‌ చేతికి వస్తుందనేది ఉద్యోగులకూ తెలియని పరిస్థితి!   

Flash...   ఏపీలో మరో ఉచితం: జగన్ రివ్యూ ఆదేశాలు

సమీక్షలతోనే రెండేళ్లు..

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే సీపీఎ్‌సపై కదలిక వచ్చింది. ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో మొదటి కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగులకు ఐఆర్‌ అందించడం, సీపీఎస్‌ రద్దుపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వం నియమించిన టక్కర్‌ కమిటీ నివేదికను అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఉపసంఘానికి సహకరించేందుకు సీఎస్‌ ఆధ్వర్యంలో ఐఏఎస్‌ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఉపసంఘానికి సహకరించే ఉన్నతస్థాయి కమిటీ అప్పటి సీఎస్‌ నీలం సాహ్ని అధ్యక్షతన సమావేశమైంది. పాత పెన్షన్‌ విధానం అమలు చేయడంవల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుంది?రద్దు చేసేందుకు ఉన్న అడ్డంకులు ఏమిటి? తదితర సాంకేతిక సమస్యలను చర్చించేందుకు పండిట్‌ కన్సల్టెన్సీని అనంతరకాలంలో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పండిట్‌ కన్సల్జెన్సీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఉన్నతస్థాయి కమిటీ మరోసారి సమావేశమైన ట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యానాథ్‌దాస్‌ ఆధ్వర్యంలో కూడా సీపీఎస్‌పై సీఎం వద్ద సమావేశమై సీపీఎస్‌ రద్దుపై చర్చించినట్లు తెలుస్తోంది.

కేంద్రం ఊరటనిచ్చినా.. అమలుచేయరు..

సీపీఎస్‌ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్వహించిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉద్యోగులు.. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. సీపీఎస్‌ రద్దు అంశం పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులకు అందాల్సిన రాయితీలు కూడా దక్కడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ విధానంలో తెచ్చిన సవరణలనూ రాష్ట్రంలో అమలుచేయడం లేదంటున్నారు. డీఏ బకాయిల విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల  నిరసన వ్యక్తం చేస్తున్నారు.  

మొత్తంగా వదిలేస్తారా?

వైసీపీ ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు నిర్ణయం నుంచి వెనకడుగు వేయబోదని ఎక్కువమంది ఉద్యోగ సంఘ నేతలు బలమైన నమ్మకంతో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి వద్ద ఉన్నతస్థాయి సమావేశమైన తర్వాత సీపీఎస్‌ అంశంపై ప్రభుత్వవర్గాలు మౌనం వహించడంతో అసలు సీపీఎస్‌ రద్దు చేస్తారా?… లేక వచ్చే ఎన్నికల ముందు రద్దు చేస్తారా? మొత్తంగానే వదిలేస్తారా?.. ఇలా ఎన్నెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.  సీపీఎస్‌ రద్దు అంశాన్ని రాజకీయ అనుకూలంగా మలచుకునేందుకు కాలయాపన చేస్తున్నారా అనే సందేహాన్నీ కొందరూ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీపీఎస్‌ రద్దు అనేక కీలక అంశాలతో ముడిపడి ఉందని, ఒకసారి సీపీఎ్‌సలోకి ప్రవేశించిన తర్వాత వదిలించుకోవడం వీలుకాదని ఉన్నతస్థాయి కమిటీ సీఎం దృష్టికి తెచ్చిందని సమాచారం. సీపీఎ్‌సలో ఉన్న ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం భరించడం తప్ప మరే అవకాశం లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముందే ఆర్థిక భారంతో ఉన్న రాష్ట్రానికి సీపీఎస్‌ భారం గుదిబండగా మారుతుందని,  వేచిచూద్దాం అన్న ధోరణిలో ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Flash...   DIABETES : షుగర్‌ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

కాలయాపన లేకుండా వెంటనే రద్దు..

‘‘అధికారంలోకి వచ్చిన వారానికల్లా సీపీఎస్‌ రద్దు చేస్తామని పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ చెప్పారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఆ హామీని ఆయన నిలబెట్టుకోవాలి. ఇప్పటికే టక్కర్‌ కమిటీ సమగ్రంగా నివేదిక ఇచ్చింది. దానిని పరిశీలించి మంత్రివర్గ ఉపసంఘం, ఉన్నతస్థాయి కమిటీ నివేదికలిచ్చాయి. ఆ నివేదికల ఆధారంగా ఉద్యోగుల పట్ల సానుకూలంగా ముఖ్యమంత్రి సత్వరం స్పందించాలి’’ 

– వెంకటేశ్వరరావు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు