లింక్ పెట్టి లూటీ
కంపెనీ వార్షికోత్సవం అంటూ సైబర్ వల
బహుమతి గెలుచుకున్నారంటూ బురిడీ
అడ్డంగా బుక్ అవుతున్న అత్యాశపరులు
హైదరాబాద్ సిటీ : ప్రభాకర్ (పేరు మార్చాం) ఐటీ ఉద్యోగి. బాగా దురాశాపరుడు. ఫ్రీగా వస్తుందంటే దేన్నీ వదలడు. అలాంటి ప్రభాకర్ సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ‘అమెజాన్‌లో మీరు షాపింగ్ చేశారు. వార్షికోత్సవం సందర్భంగా తీసిన లక్కీ డ్రాలో టాటా కారు గిఫ్ట్‌గా గెలుచుకున్నారు. పూర్తి వివరాల కోసం లింక్ ఓపెన్ చేయండి’ అని మెసేజ్‌లో ఉంది. అమెజాన్ షాపింగ్ చేసే అలవాటున్న ప్రభాకర్ నిజంగానే గిఫ్ట్ వచ్చి ఉంటుందని నమ్మాడు. ఆ లింక్ ఓపెన్ చేశాడు. అందులో గిఫ్ట్ వివరాలతో పాటు మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఉంది.
వెంటనే వారికి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన అపరిచితుడు ‘కంగ్రాట్స్ ప్రభాకర్ సర్.. మీరు రూ. 14 లక్షల విలువైన కారు గెలుచుకున్నారు’ అంటూ ప్రభాకర్ పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం ప్రభాకర్ ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇన్సూరెన్స్, ట్రాన్స్‌పోర్టు తదితర పేర్లతో విడతల వారీగా అపరిచితుడు సూచించిన బ్యాంకు ఖాతాలో రూ. 3.50 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ కారు రాలేదు. ‘కారు బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. కానీ అంటూ..’ ఇంకా ఏవేవో చార్జీలు చెల్లించాలి అంటూ మరికొంత డబ్బులు కోరాడు. దాంతో అనుమానం వచ్చిన ప్రభాకర్ అపరిచితుడిని నిలదీశాడు. అప్పటి నుంచీ అవతలి వ్యక్తి ఫోన్ స్విచాఫ్ వస్తోంది. మోసపోయానని గుర్తించిన ప్రభాకర్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి తనగోడు వెల్లబోసుకున్నాడు. టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించిన పోలీసులు ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాళ్లు ఈ మెసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
లింక్‌లు ఓపెన్ చేయొద్దు..
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఈ కామర్స్ వెబ్‌సైట్లు పెట్టే ఆఫర్లు, గిఫ్ట్‌లకు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. దీన్ని అవకాశంగా భావించిన సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్న కస్టమర్ల డేటాను సంపాదిస్తున్నాడు. కొన్న వస్తువు, తేదీ, అడ్రస్ లేదా ఫోన్ నంబర్ ఆధారంగా ఫైనల్ డేటా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత అమెజాన్‌లో ఫ్రీ గిఫ్ట్ వచ్చిందంటూ బల్క్ ఎస్‌ఎంఎ్‌సలు పంపుతున్నారు. దాంతో పాటు నకిలీ లింక్‌ను పంపుతున్నారు. అవతలి వ్యక్తుల ప్రతిస్పందనను బట్టి తమ మాటలతో ఆకట్టుకుంటున్నారు. వారిని నమ్మించడానికి వస్తువు వివరాలు, కొన్న తేదీ వంటి విషయాలు వల్లిస్తున్నారు. దాంతో కస్టమర్లు నమ్మి నేరగాళ్ల వలలో చిక్కగానే ఖరీదైన గిఫ్ట్ పంపుతున్నామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల చార్జీల పేరుతో అందినంత దండుకుంటున్నారు. ఆ తర్వాత ఫోన్‌లు స్విచాఫ్ చేస్తున్నారు.
ఆశపడితే మోసపోతారు..
ఒక చిన్న పనిచేసే ముందు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ముక్కు మొఖం తెలియని అపరిచితుల మాటలు ఎలా నమ్ముతారు. ఉచితంగా ఖరీదైన గిఫ్ట్‌లు పంపుతున్నామనగానే అత్యాశకు పోతే కచ్చితంగా మోసపోతారు. – వి.సి. సజ్జనార్, సైబరాబాద్ సీపీ.