న్యూఢిల్లీ: ఇప్పటికే ఇండియాలో తొలిసారి కనిపించిన డెల్టా వేరియంట్ మన దేశంతోపాటు ఇతర దేశాలను కూడా వణికిస్తోంది. ఇప్పుడీ డెల్టా కాస్తా మరోసారి మ్యుటేట్ అయి డెల్టా ప్లస్ (ఏవై.1)గా మారింది. డెల్టా వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడీ వేరియంటే యూకేనూ భయపెడుతోంది. దీంతో అక్కడి ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్‌డౌన్ ఆంక్షలను జులై 19 వరకూ పొడిగించాల్సి వచ్చింది. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది.
అసలేంటీ డెల్టా ప్లస్?
కే417ఎన్ మ్యుటేషన్ ద్వారా కరోనా బీ.1.617.2.1 వేరియంట్ వచ్చినట్లు సైంటిస్టులు చెప్పారు. ఇదే డెల్టా ప్లస్ వేరియంట్. ఈ కే417ఎన్‌లోనూ రెండు గ్రూపులు ఉన్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయంగా కనిపించగా, మరొకటి అమెరికాలోని జీఐఎస్ఏఐడీలో జరిగిన జీనోమ్ సీక్వెన్స్‌లలో కనిపించింది.
ఈ నెల 7వ తేదీ వరకూ జీఐఎస్ఏఐడీలో 63 జీనోమ్స్‌లలో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కెనడా, జర్మనీ, రష్యా, నేపాల్, స్విట్జర్లాండ్, ఇండియా, పోలాండ్, పోర్చుగల్, జపాన్, అమెరికాల నుంచి వచ్చినవి. ఈ వేరియంట్ కేసులు యూకేలో 36, అమెరికాలో మొత్తం కేసుల్లో 6 శాతం ఉన్నట్లు గుర్తించారు. ఈ జీనోమ్ తొలి సీక్వెన్స్‌ను ఈ ఏడాది మార్చిలో యూరప్‌లో కనుగొన్నారు.
ఎంత ప్రమాదకరం?
ఈ కొత్త వేరియంట్ ఇప్పటి వరకూ కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను కూడా బోల్తా కొట్టిస్తోంది. అయితే ఇండియాలో ఈ కేసులు అంతగా లేవని, అందువల్ల ఈ వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇండియా నుంచి జూన్ 7 వరకు ఆరు జీనోమ్స్‌లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కనిపించింది.