ఆందోళనకారక వేరియంట్లపై 93 శాతం
హైరిస్క్ గ్రూపువారిపై 91% ప్రభావశీలత : నోవావాక్స్
న్యూఢిల్లీ, జూన్ 14: అమెరికాకు చెందిన నోవావాక్స్ కంపెనీ తయారుచేసిన కరోనా టీకా (ఎన్‌వీఎక్స్ కొవ్ 2373).. 90.4% ప్రభావశీలతను (ఎఫికసీ) చూపుతున్నట్టు ట్రయల్స్‌లో తేలింది. మరీ ముఖ్యంగా.. ఉత్పరివర్తనాల వల్ల కొత్తగా ఏర్పడిన పలు వేరియంట్ల (వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (డెల్టా వేరియంట్ వంటివి), వేరియంట్స్ ఆఫ్ ఇంట్రె్‌స్ట)పై తమ టీకా ఎఫికసీ 93.2% ఉన్నట్టు నోవావాక్స్ కంపెనీ పేర్కొంది. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీలోకి రాని మిగతా వేరియంట్లన్నింటిపైనా 100% ప్రభావశీలత చూపిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే.. హైరిస్క్ గ్రూపు, అంటే 60 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై 91% ఎఫికసీ ఉన్నట్టు తెలిపింది. అమెరికా, మెక్సికో దేశాల్లోని 119 చోట్ల.. 29,960 మందిపై ఈ టీకా మూడో దశ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో 77 మందికి కరోనా వచ్చింది. ఆ 77 మందిలో 63 మంది ప్లాసిబో (సెలైన్ వాటర్ మాత్రమే) తీసుకున్నవారు కాగా.. 14 మంది మాత్రం నోవావాక్స్ టీకా తీసుకున్నవారు.
ప్లాసిబో తీసుకున్న 63 మందిలో 10 మందికి మోడరేట్ (కొద్దిపాటి) లక్షణాలు కనపడగా.. నలుగురికి ఇన్ఫెక్షన్ తీవ్రతరమైంది(సివియర్). వ్యాక్సిన్ తీసుకున్న 14 మందిలో ఎవరికీ ఇన్ఫెక్షన్ తీవ్రత మోడరేట్, సివియర్ దశకు చేరలేదు. స్వల్ప లక్షణాలతోనే తగ్గిపోయింది. కాబట్టి, తమ టీకా వేసుకున్నవారికి ఇన్ఫెక్షన్ తీవ్రత మోడరేట్ (కొద్దిపాటి), సివియర్ (తీవ్ర)స్థాయికి వెళ్లకుండా 100% రక్షణ ఉంటుందని నోవావాక్స్ కంపెనీ ప్రకటించింది. కాగా.. ఈ టీకా ను ఫ్రిజ్‌లో (2-8 డిగ్రీల సెల్సియస్) భద్రపరిస్తే చాలు. మోడెర్నా, ఫైజర్ టీకాల్లాగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రపరచక్కర్లేదు. కాగా.. తమ టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం ఈ ఏడాది దరఖాస్తు చేసుకోనున్నట్టు నోవావాక్స్ తెలి పింది. సెప్టెంబరు చివరినాటికి నెలకు 10 కోట్ల డోసులు, ఈ ఏడాది చివరికి నెలకు 15 కోట్ల డోసుల తయారీకి సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
ఇదీ లెక్క
వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 77 మంది వైరస్ బారిన పడగా.. వారిలో 54 మంది నుంచి నమూనాలను తీసుకుని జన్యుక్రమావిష్కరణ చేశారు. వాటిలో 35 కేసులు వేరియంట్ ఆఫ్ కన్సర్న్, 9 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రకాలకు చెందినవని, 10 కేసులు ఈ రెండు కేటగిరీల్లోకి రాని మామూలు వేరియంట్లవని తేలింది. మొత్తం 54 కేసుల్లో 82ు పై రెండు రకాలకు చెందినవే. వీటిలో కూడా ప్లాసిబో గ్రూపువారిలో ఈ తరహా కేసులు 38 రాగా.. టీకా తీసుకున్నవారిలో ఆరుగురికి ఈ వైర్‌సలు ఇన్ఫెక్షన్ కలిగించగలిగాయి