PRC పై పోరు

🟦36 నెలల వాయిదాపై ఉద్యోగుల మండిపాటు

🟦రిటైర్మెంటు ప్రయోజనాలకు దెబ్బ

🟦కరోనా వంకతో వంచిస్తున్న ప్రభుత్వం

🟦 తక్షణం ఇవ్వకుంటే ఆందోళనకు సిద్ధం

పదకొండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసుల అమలుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలులోకి తేవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాలు పీఆర్సీ కోసం పట్టుపట్టాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాయి. ఇదిగో..అదిగో అంటూనే 36 నెలలపాటు పీఆర్సీని అమలు చేయక పోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇంత సుదీర్ఘకాలం పీఆర్సీ అమలు చేయకుండా వాయిదా వేయడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే జరగలేదని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమ పథకాలపై ఉన్న శ్రద్ధ ఉద్యోగుల బతుకు దెరువుపై లేకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇక ఆందోళనబాట పట్టక తప్పదన్న నిర్ణయానికి ఉద్యోగ సంఘాలు వచ్చాయి.   

ఏలూరు, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి) 

2018 జూన్‌తో ముగిసిన గడువు

2018 జూన్‌ 30 నాటికి పదో పీఆర్సీ గడువు ముగిసింది. దీంతో ఉద్యోగులు 55 శాతం ఫిట్మెంట్‌ ఉండేలా పీఆర్సీని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మే 25న అశుతోశ్‌మిశ్రా నేతృత్వంలో 11వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక రావడం ఆలస్యం కావడంతో అప్పటి ప్రభుత్వం 2019 ఏప్రిల్‌ 1న ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తూ జీవో జారీ చేసింది. అది అమలులోకి రాకుండానే ప్రభుత్వం మారిపోయింది. కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించింది. జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఫలితంగా ఉద్యోగులు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల ఐఆర్‌ కోల్పోవలసి వచ్చింది. అది మొదలు ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ఊసే ఎత్తకుండా రెండేళ్ల కాలాన్ని నెట్టుకొచ్చేసింది. 2018లో ఏర్పాటు చేసిన పదకొండో పీఆర్సీ కమిటీ 2020 అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీంతో అప్పటి నుంచైనా పీఆర్సీ అమలులోకి వస్తుందని ఉద్యోగులు భావించారు.  నివేదికలో ఏముందో కూడా ఈరోజు వరకూ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదు. పీఆర్సీ నివేదిక వచ్చి ఇప్పటికి 9 నెలలు పూర్తయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది. 

Flash...   Google Maps: మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైన గూగుల్.. ఆ ఫిచర్‌తో ప్రయోజనాలేంటంటే..

ఉద్యోగుల కాళ్లు కట్టేసిన కరోనా

ప్రభుత్వం తమ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ కరోనా కారణంగా తామేమీ చేయలేకపోతున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి. 2020 మొదట్లోనే ప్రారంభమైన ఆందోళనలు కరోనా, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నిబంధనల కారణంగా అర్ధంతరంగా ఆగిపోయాయి. 2020 మార్చిలోనే వేలాది మంది ఉపాధ్యాయులు పీఆర్సీ కోసం రోడ్లెక్కారు. ఆ వెంటనే కరోనా రావడంతో ఆ ఆందోళన అక్కడితో ఆగిపోయింది. ఈ ఏప్రిల్‌లో మరోమారు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. ఆ తరువాత కొవిడ్‌ విరుచుకుపడడంతో ఆందోళనలు ఆగిపోయాయి. ఇదే అదనుగా ప్రభుత్వం వేతన సవరణను గాలికి వదిలేసిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన శాసనమండలి బడ్జెట్‌ సమావేశంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఆర్థిక మంత్రిని నిలదీయగా ఆయన కరోనా వంక చెప్పి తప్పించుకున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. 

పదవీ విరమణ ప్రయోజనాలకు గండి

రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయని కార ణంగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు ఘోరంగా నష్టపోయారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రిటైరైన ఒక్కో ఉద్యోగికి పాత పీఆర్సీ ప్రకారం గ్రాట్యుటీ, పెన్షన్‌ ఇవ్వడం వల్ల సగటున ఏడు లక్షల రూపాయల మేర నష్టం వచ్చి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ మూడేళ్ల కాలంలో జిల్లాలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసి ఉంటారని వీరంతా సుమారు రూ.140 కోట్ల మేర ప్రయోజనాలు కోల్పోవలసి వచ్చిందని చెబుతున్నారు.

ఇంత జాప్యం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో లేదు : షేక్‌ సాబ్జీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

పీఆర్సీ అమలులో 36 నెలల జాప్యం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే లేదు. దీనిపై బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక మంత్రిని నిలదీశాం. విధాన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశాం. ఆయన కరోనా వంక చెప్పి తప్పించుకున్నారు. ఇక బలమైన పోరాటాలకు ఉద్యోగులు సిద్ధం కావాల్సిందే..!

55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందే : శ్రీనివాసరావు, ఎన్‌జీవో యూనియన్‌ నేత

మూడేళ్లుగా పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నాం. మేం డిమాండ్‌ చేసిన 55 శాతం ఫిట్మెంట్‌ ఇవ్వాల్సిందే. 2020 అక్టోబరులో  నివేదిక వచ్చింది. ఆ నివేదిక వచ్చాక పీఆర్సీ అమలుకు ప్రభుత్వం చొరవ చూపలేదు. పైపెచ్చు నివేదికలో ఏముందో బయటికి రానీయలేదు. ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపునకు ఇది నిదర్శనం.

Flash...   Vasudha Pharma Contribution for 72 schools in WG and Vizag in nadu nedu

మూడేళ్లు గడిచినా దిక్కులేదు : గోపిమూర్తి, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి

జూలై 1కి పీఆర్సీ ముగిసి మూడేళ్లవుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్త య్యింది. కానీ ఉద్యోగుల గురించి పట్టించుకునే నాథుడు లేడు. ఫలితంగా ఎంతో మంది రిటైరైన ఉద్యోగులు నష్టపోయారు. రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నాం. కరోనా వచ్చి ప్రభుత్వాన్ని కాపాడుతోంది. లేకుంటే ఆందోళనలు తారస్థాయిలో ఉండేవి. ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం వీడాలి.