న్యూఢిల్లీ: పిల్లలకు యాంటీ కోవిడ్ -19 వ్యాక్సిన్ల లభ్యతలో గణనీయమైన విజయం సాధించామని, దీంతో వారిని పాఠశాలలకు పంపించేందుకు, స్కూలు కార్యకలాపాలు ప్రారంభించడానికి మార్గం సుగమమవుతుందని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. రెండు నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలపై భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు సంబంధించిన మొదటి దశ, రెండవదశ ట్రయల్స్ డేటా సెప్టెంబర్ నాటికి వస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.
అనంతరం దేశంలోని చిన్నారులకు టీకాలు అందుబాటులో ఉండవచ్చని ఆయన అన్నారు. దీనికన్నా ముందుగా ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదం పొందితే అది కూడా పిల్లలకు ఒక వ్యాక్సిన్ ఎంపికగా మారుతుందన్నారు. అలాగే జైడస్ వ్యాక్సిన్ ఆమోదంపొందితే అది కూడా మరొక ఎంపిక అవుతుందన్నారు. పాఠశాలలు తిరిగి తెరవాలంటే చిన్నారులకు టీకాలు వేయడం తప్పనిసరి అని అన్నారు.