Without Fridge : ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు తీరిక లేని జీవితాలను గడుపుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ బతికేవారి జీవితం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అందుకే వారు సెలవు దొరికినప్పుడే అన్ని పనులను పూర్తిచేసుకుంటారు. ఇంట్లోకి కూడా వారానికి ఒక్కసారి జరిగే సంతలో వారానికి సరిపడ కూరగాయలు, సరుకులను తీసుకొస్తారు. అయితే వాటిని నిల్వ చేయడమే కష్టంగా మారుతుంది. మామూలుగా అయితే ఫ్రిజ్‌లో పెడితే సరిపోతుంది కానీ అందరికి ఫ్రిజ్ ఉండదు కదా. అందుకే ఫ్రిజ్ లేనివారు కూరగాయలను తాజాగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. టమాటాలను ఇంట్లో చల్లగా ఉండే ప్రాంతంలో ఉంచాలి. అన్నింటినీ ఒకే దగ్గరగా కాకుండా కొంత గ్యాప్ ఉండేలా దూరం దూరంగా స్టోర్ చేసుకోవాలి. ఇలా చేస్తే టమాటాలు త్వరగా పాడవవు.
2. భూమి లోపల పెరిగే క్యారెట్, బీట్‌రూట్ వంటి దుంపలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వేర్లు, ఆకులను తీసివేసి శుభ్రంచేసుకోవాలి. వాటిని ఇంట్లో కూల్‌గా ఉండే ప్రాంతంలో నిల్వ చేసుకోవాలి.
3. పుదీనా కట్టలను విప్పిదీసి అన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. పాడైపోయిన ఆకులు, మట్టిని తొలగించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లుపోసి అందులో పుదీనాను ఉంచండి. ఆకులు పైకి తేలి వేర్లు నీటిలో మునిగేలా చూసుకోండి. అనంతరం ఓ కాటన్ వస్త్రాన్ని నీటితో తడిపి ఆ గిన్నెపై కప్పాలి. ఇలా చేస్తే పుదీనా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
4. పుట్టగొడులు త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని పేపర్ బ్యాగ్‌లో ఉంచి చల్లని ప్రదేశంలో ఉంచాలి.
5. మార్కెట్ నుంచి తెచ్చుకున్న కొత్తమీరను నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పటికే పాడయిపోయిన ఆకులను తొలగించాలి. తర్వాత కొత్తమీరను పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఇంట్లో చల్లగా ఉండే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే కొత్తిమీర తాజాగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫ్రిజ్ లేకుండానే కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.