Yoga Day: విద్యార్థులకు యోగా పోటీలు

అమరావతి/గన్నవరం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ఆయుష్‌ శాఖ.. విద్యార్థులకు వర్చువల్‌గా యోగాసనాల పోటీలు నిర్వహిస్తోంది. పోటీల వివరాలను శనివారం ప్రకటించింది. ఈ పోటీలు రెండు దశల్లో ఉంటాయి. మొదటి దశలో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి. 2021 జూన్‌ 1 నాటికి 18 ఏళ్లు లోపు వారు అర్హులు. మొదటి దశ పార్ట్‌-ఏ, బీల్లో నాలుగేసి ఆసనాలు ఉంటాయి. పార్ట్‌-ఏలో గరుడ ఆసనం, పశ్చిమోత్తానాసనం, హలాసనం, శీర్షాసనం.. పార్ట్‌-బీలో  పూర్ణ నటరాజ ఆసనం, పూర్ణ సుప్త వజ్రాసనం, బకాసనం, ధనుర్‌ ఆసనం ఉంటాయి. రెండు పార్టుల్లో ఏవైనా రెండేసి ఆసనాలు చేస్తూ వీడియో రికార్డు చేయాలి.

వీడియో మొదట్లోనే విద్యార్థి పేరు, వయస్సు, తరగతి, పాఠశాల/కళాశాల పేరు, జిల్లా, విద్యార్థి కాంటాక్ట్‌ ఫోన్‌ నంబరు ప్రదర్శించాలి. 4 ఆసనాలను 5 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఈ వీడియోలను ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా 2021yogacompetition@gmail.com కు పంపాలి. మొదటి దశలో ఎంపికైన వారికి రెండో దశ పోటీలు వర్చువల్‌ పద్ధతిలో న్యాయ నిర్ణేతల సమక్షంలో నిర్వహిస్తారు. రెండో దశ వివరాలు, తేదీని ఫోన్‌లో తెలియజేస్తామని, విజేతలకు ఈ నెల 21న రాష్ట్ర స్థాయిలో బహుమతులు అందజేయనున్నట్లు ఆయుష్‌ శాఖ తెలిపింది. 

Flash...   PRC ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా?