రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుపై జులై నెలాఖరులోగా ఆర్థికశాఖ అధికారులు, ఇతర అధికారులతో చర్చిస్తాం . ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతోను సమావేశం ఏర్పాటు చేస్తాం’’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హామీ ఇచ్చారు. ఎన్ జీ వో సంఘం నేతలు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి ,కృపావరం తదితరులు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి మాట్లాడారు. పెండింగు పీఆర్సీతో పాటు ఏడు డీఏ ల అమలుపైనా వారు వినతిపత్రాలు సమర్పించారు.
పీఆర్సీ అమల్లో ఆలస్యం వల్ల పదవీ విరమణ చేసిన చేస్తున్న వారికి నష్టం ఎదురవుతోందని, 55శాతం ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్ జీ వో నేతలు కోరారు. కేంద్రం కూడా డీఏలు విడుదల చేసినందున రాష్ర్ట ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జీవో 94 ప్రకారం 2021 నుంచి రావాల్సిన డీఏ బకాయిలు, రెండో విడత రావాల్సిన డీఏ బకాయిలు ఇప్పించాలని కోరారు. 1.7.2021 నుంచి కొత్త డీఏ అమలు చేయాల్సిన అవసరాన్ని వారు వివరించారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ దిల్లీ నుంచి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు.