కట్టడి చర్యలపై ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ, జూలై 7 : దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తొమ్మిది రాష్ట్రాల్లో కట్టడి చర్యలను పకడ్బందీగా అమలుచేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్దేశించింది. ఈమేరకు అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర, సిక్కిం ప్రభుత్వాలకు ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టెస్టులను పెంచడంతో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం, వైద్య వసతుల అభివృద్ధిపై దృష్టిసారించాలని సూచించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆందోళనకర స్థాయిలో పాజిటివిటీ రేటు పెరుగుతోందని, జూన్ 28- జూలై 4 వారంలో ఇది 16.2 శాతానికి చేరిందని తెలిపారు. ఒడిశా, కేరళలలోని పలు జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు 10 శాతం మేర నమోదైనట్లు చెప్పారు. గత వారం వ్యవధిలో దేశంలో 10 శాతానికిపైగా ‘పాజిటివిటీ రేటు’ నమోదైన 73 జిల్లాల్లో 45.. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో దానిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం సమీక్షించారు.
మరణాల రేటు 9 నెలల కనిష్ఠానికి..
దేశంలో బుధవారం 43,733 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాటి 34,703 కేసులతో పోలిస్తే.. 9,003 కేసులు పెరిగాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3.06 కోట్లు దాటింది. గత 24 గంటల్లో 930 మంది కరోనాతో మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4.04 లక్షలకు పెరిగింది. మరో 47,240 మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 2.98 కోట్లకు చేరింది. ఈనేపథ్యంలో 4,59,920 యాక్టివ్ కేసులే మిగిలాయి. మంగళవారం ఒక్కరోజే దేశంలో 19.07 లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించడంతో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 42.33 కోట్లకు చేరింది. వరుసగా 16వ రోజు కూడా రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 2.29 శాతం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద 1.67 కోట్ల టీకా డోసుల స్టాక్ ఉందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటిదాకా దేశంలో 35.75 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్ జరిగిందని పేర్కొంది. కాగా, గత వారంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగినప్పటికీ, మరణాల రేటు 9 నెలల కనిష్ఠానికి (అక్టోబరు నాటి స్థాయికి) పడిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.