ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ఆగస్టులో నోటిఫికేషన్లు
ఇప్పటికే ఏపీపీఎస్సీకి 1,180 ఖాళీ పోస్టుల సమాచారం
ఇంకా గ్రూప్–1, గ్రూప్–2 అదనపు పోస్టులపై ప్రభుత్వం కసరత్తు
2018 నోటిఫికేషన్లలో 364 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు కరవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 1,200కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2 సహా 1,200కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో ఈ నోటిఫికేషన్లు జారీచేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్.సలాంబాబు మీడియాతో చెప్పారు. ‘ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జాబ్ క్యాలెండర్‌పై కొందరిలో కొన్ని అపోహలు తలెత్తాయి. అవేవీ నిజం కాదు. వాస్తవానికి అనేక పోస్టుల భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఏపీపీఎస్సీ వద్ద 1,180 వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా గ్రూప్–1, గ్రూప్–2 కేటగిరీల్లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు. 2018లో జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు 364 పోస్టులు భర్తీ కాలేదు. వాటితో పాటు ఇతర ఖాళీలభర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు.