త్వరలో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

 సన్నాహాలు చేస్తున్న ఏపీపీఎస్సీ 

రిజర్వేషన్‌ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి పెంపు ఉత్తర్వుల కోసం ప్రభుత్వానికి లేఖ 

ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుకు చర్యలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఈ నెలాఖరున నోటిఫికేషన్లు విడుదల చేసేలా కమిషన్‌ కసరత్తు పూర్తి చేసి అంతా సిద్ధంగా ఉంచింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్‌ క్యాటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి మే నెలలో ముగిసింది. ఈ నేపథ్యంలో రిజర్వుడ్‌ అభ్యర్ధుల గరిష్ట వయో పరిమితి ఉత్తర్వుల పొడిగింపుపై కమిషన్‌ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.


మరోవైపు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలుకు ప్రభుత్వం ఇంతకు ముందే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కోటాలో పోస్టులు మిగిలితే కనుక వాటిని క్యారీ ఫార్వర్డ్‌ చేయాలా? వద్దా? అనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం కమిషన్‌ లేఖ రాసింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. 1,180 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో 49 విడుదల చేయడం తెలిసిందే. రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్‌ కోటా మిగులు పోస్టులపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తుందని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే 15 విభాగాల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేస్తూ పోస్టుల భర్తీకి కమిషన్‌ చర్యలు చేపట్టనుంది. 

Flash...   పాఠాలు కావాలా .. ? ప్రాణాలు కావాలా .. ?