రోజుకి పది గంటలు బడి …

ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు

పెంచిన 3 గంటలు సహ పాఠ్యాంశాల నిర్వహణ

విద్యా సంవత్సరంలో 188 పని దినాలు

ఈనాడు – అమరావతి: ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని పొడిగించారు. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు,
తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచి.. ఉన్నత పాఠశాలల మొత్తం సమయాన్ని
10 గంటలు చేశారు. పెంచిన 3 గంటల సమయాన్ని ఐచ్ఛిక సహ పాఠ్యాంశాలు, విరామం కోసం
కేటాయిస్తున్నారు. ఉన్నత పూర్వ, ఉన్నత, ఉన్నత ప్లస్‌ బడులు ఉదయం 8 గంటల నుంచి
సాయంత్రం 6 గంటల వరకు పని చేసేలా పాఠ్య ప్రణాళికను రూపొందించారు. గతంలో
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు పని చేసేవి.
గతేడాది కరోనా నేపథ్యంలో ఈ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు మార్చారు.
ఇప్పుడు సహ పాఠ్య కార్యక్రమాల కోసం సమయం పెంచుతూ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ
మండలి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 188 రోజులు
బడులు పని చేయనున్నాయి. ఏప్రిల్‌ 30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం
వేసవి సెలవులు ఇస్తారు.

డిసెంబరులో సమ్మెటివ్‌ పరీక్షలు

సమ్మెటివ్‌-1 పరీక్ష 6-10 తరగతులకు డిసెంబరు 27 నుంచి జనవరి 7 వరకు, సమ్మెటివ్‌-2
పరీక్ష 6-9 తరగతులకు ఏప్రిల్‌ 18 నుంచి 29 వరకు నిర్వహిస్తారు. సెప్టెంబరు,
నవంబరు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫార్మెటివ్‌ పరీక్షలు ఉంటాయి. ఈ ఏడాదీ
విద్యార్థులు నీళ్లు తాగేందుకు ‘నీటి గంట’ అమలు చేస్తున్నారు. ఇందుకు 5 నిమిషాలు
విరామం ఇస్తారు. ప్రతి నెలా మొదటి, మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ను
నిర్వహిస్తారు. బోధన ప్రణాళికలు, తరగతిలో గమనించిన అంశాలు రాసుకునేందుకు
ఉపాధ్యాయులకు ప్రత్యేక డైరీ ఉంటుంది. విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంచేందుకు
ప్రతి రోజు ఒక పీరియడ్‌ ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమానికి కేటాయిస్తారు. 9, 10
తరగతుల విద్యార్థులకు ప్రతి శుక్రవారం 8వ పీరియడ్‌లో ‘కెరీర్‌ గైడెన్స్‌’పై
అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులను ఆహ్వానిస్తారు.
వారంలో ఒక రోజు పాఠశాల ఆరోగ్య కార్యక్రమం, ప్రముఖ దినోత్సవాలు, సామూహిక
పఠనంలాంటివి నిర్వహించాల్సి ఉంటుంది.

Flash...   Deputation to Single school teachers - orders

బడి వేళలు ఇలా...

6 రకాల పాఠశాలలను ప్రారంభించిన అధికారులు వీటి సమయాల్లోనూ ఇలా మార్పులు
చేశారు. 


శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాల (పీపీ-1, 2): పాఠశాల సమయం ఉదయం 9.05 నుంచి సాయంత్రం
3.30 వరకు ఉంటుంది.


* 11.50 నుంచి మధ్యాహ్నం 1.50 వరకు మానసిక వికాస వృద్ధి కార్యక్రమం, మధ్యాహ్న
భోజన విరామం.


ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌: పాఠశాల ఉదయం 8 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుంది.
ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు సహ పాఠ్యాంశాలు (స్వీయ పఠనం, పర్యవేక్షక పఠనం, చదవడం
మాకిష్టం, పోటీ పరీక్షల సన్నద్ధత).


* సాయంత్రం 3.30 నుంచి 4.30గంటల వరకు సహ పాఠ్యాంశాలు (ఆటలు, సవరణాత్మక బోధన,
గ్రంథాలయ కృత్యాలు) ఐచ్ఛికంగా నిర్వహిస్తారు.


ఉన్నత పూర్వ, ఉన్నత, ఉన్నత ప్లస్‌: ఉదయం 8నుంచి సాయంత్రం 6 వరకు పాఠశాల
కొనసాగుతుంది.


* ఉదయం 8 నుంచి 8.45 వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సహ పాఠ్యాంశాలు
ఐచ్ఛికంగా ఉంటాయి