విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను ఉంచాలి: సీఎం జగన్‌.


సాక్షి, అమరావతి: స్కూళ్లలో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను
ఉంచాలని, టీచర్ల అనుభవం, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌
తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖపై బుధవారం సమీక్ష
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్ల వర్గీకరణకు తగినట్టుగా
టీచర్లను పెట్టాలని, విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలని
అధికారులను ఆదేశించారు. టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని
వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈనెల 16న పశ్చిమగోదావరి జిల్లాలో
విద్యా కానుక ప్రారంభం కానుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా
టీచర్లను ఉంచడంపై తయారుచేసిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి
వివరించారు.

నూతన విద్యావిధానం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ 

శాటిలైట్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2) 

ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2. 1, 2)

ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)

ప్రీ హైస్కూల్స్‌ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)

హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకూ)

హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ) వర్గీకరించామని అధికారులు సీఎం
జగన్‌కు వివరించారు. పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణ వల్ల సుమారుగా
ఇప్పుడున్న స్కూల్స్‌  44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్‌ అవుతాయని
అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.

తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలి

3వ తరగతి నుంచి నిపుణులైన టీచర్ల ద్వారా విద్యాబోధన జరగాలని తెలిపారు.
ప్రపంచస్థాయి పోటీకి తగినట్లుగా విద్యార్థులు తయారవుతారని చెప్పారు. ఇంగ్లిష్‌
మీడియంలో బోధన అందుతుందని, తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం
జగన్‌ అధికారులను ఆదేశించారు. నూతన విద్యావిధానం, నాడు-నేడు కోసం రూ.16 వేలకోట్ల
ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 

నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తేవాలని, నూతన విద్యా విధానం ఉద్దేశాలను
వివరంగా తెలియజేయాలని సీఎం  జగన్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్లు,
జేసీలు, డీఈవోలు, పీడీలకు అవగాహన కల్పించాలన్నారు. అమ్మఒడి, ఇంగ్లిష్‌ మీడియం,
నాడు-నేడు వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని అధికారులు 
సీఎం జగన్‌కు వివరించారు.  ఈ సమావేశానికి  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Flash...   సాహో.. బాబాసాహెబ్‌ అంబేడ్కర్