ప్రాథమిక విద్యా రంగంలో సంస్కరణల అమలు కోసం ప్రాధాన్యతలేమిటి ?

 

ప్రాథమిక విద్యా రంగంలో సంస్కరణల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న హడావిడి
విస్మయాన్ని కలిగిస్తోంది. ఆరు నూరైనా ఈ ఏడాది నుండే మార్పులు తీసుకురావాలని
భావిస్తున్న ప్రభుత్వం ఆ క్రమంలో అన్ని ప్రజాస్వామ్య సాంప్రదాయాలను తుంగలో
తొక్కుతోంది. ఆగస్టు 16 నుండి పాఠశాలలు తెరవడంతో పాటు, ఆ రోజు నుండే విద్యారంగంలో
మార్పులకు నాంది పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా ఉధృతి
ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ రెండు వేలకు పైగానే పాజిటివ్‌ కేసులు
నమోదవుతున్నాయి. మూడో విడత ముప్పు గురించి హెచ్చరికలూ తీవ్రస్థాయిలోనే
వస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే రాష్ట్ర ప్రజలకు
సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 16వ తేది బడులు తెరిచినా
పూర్తిస్థాయిలో విద్యార్థులు తరగతులకు హాజరవుతారా? తల్లిదండ్రులు తమ పిల్లలను
బడులకు పంపడానికి సిద్ధపడతారా? నిజానికి, దాదాపు ఏడాది కాలంగా పాఠశాలలు మూతపడి
ఉన్నాయి. విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర
ప్రభావం చూపుతోందన్న అధ్యయనాలు వచ్చాయి. మరోవైపు ఆన్‌లైన్‌ విద్య పేరుతో చేసిన
ప్రయోగాలు సామాజిక, ఆర్థిక అంతరాల కారణంగా ఫలితమివ్వలేదు. పెద్ద సంఖ్యలో
విద్యార్థులు ఆన్‌లైన్‌ చదువులకు దూరంగా మిగిలారు. పాఠశాలల మూసివేత కొనసాగితే ఈ
అంతరాలు, మానసిక వైకల్యాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం
ప్రాధాన్యత దేనికివ్వాలి?

రెండవ విడత కరోనా విరుచుకుపడటానికి ముందు కొద్దిరోజుల పాటు తెరిచిన బడులలో భౌతిక
దూరం పాటించడం నుండి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం
విఫలమైంది. ఫలితంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. సుమారు
వెయ్యి మంది టీచర్లు మరణించారు. విద్యార్థులకూ వైరస్‌ సోకింది. మృతుల సమాచారమే తమ
వద్ద లేదని విద్యాశాఖ చెప్పడం వేరే సంగతి! తాజాగా బడులు తెరుస్తున్న నేపథ్యంలో
అటువంటి తప్పులు మళ్లీ జరగకుండా చూడటం ప్రభుత్వ కనీస బాధ్యత. బడులు తెరిచేలోగా
ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్న సి.ఎం ఆదేశాలే తప్ప, ఎంతమందికి
వేశారు? ఇంకా ఎందరికి వేయాలన్న లెక్కలు చెప్పరు. వాస్తవానికి ఉపాధ్యాయులకే కాదు,
పాఠశాలల్లోని సిబ్బంది అందరికి వ్యాక్సిన్‌ వేసినప్పుడే కొంతమేరకైనా భద్రత
లభిస్తుంది. కేరళతో పాటు ఆరేడు రాష్ట్రాలు ఇప్పటికే విద్యాసంస్థలను
పున:ప్రారంభించాయి. అక్కడ ఏ తరహా జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధ్యయనం చేసి,
ఉపయోగపడేవి ఉంటే మన రాష్ట్రంలో అమలు చేస్తే మంచిది. ఈ తరహా చర్యలు తీసుకుంటే తమ
చిన్నారుల భద్రతకు ఢోకా లేదన్న భరోసా తల్లిదండ్రులకు కలుగుతుంది. అప్పుడే తమ
పిల్లలను బడులకు పంపుతారు.

Flash...   ఉద్యోగులకు వడ్డీ ఇవ్వాలా?!

ఈ దిశలో చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా
విద్యారంగ సంస్కరణల అమలుకు హైరానా పడుతోంది. పూర్తి స్థాయిలో చర్చ జరపకుండానే
హడావిడిగా మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ఆరు నుండి పది సంవత్సరాల లోపు
పిల్లల అభ్యసన, మానసిక సామర్ధ్యాలు, ఎదుగుదల ఒకే మాదిరి ఉంటాయని ఉపాధ్యాయులతో
పాటు మానసిక శాస్త్రవేత్తలూ చెబుతున్నా పట్టించుకోకుండా తరగతుల విభజనకు,
తరలింపునకు ప్రభుత్వం సిద్ధమైపోతోంది. దీనివల్ల విద్యార్థులపై తీవ్ర ప్రభావం
పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంగన్‌వాడీలను బడులుగా మార్చడంతో మాతా
శిశు సంరక్షణ లక్ష్యం దెబ్బ తింటుంది. ఒక్క టీచర్‌నూ తొలగించబోమని చెబుతున్న
సర్కారు దాదాపు 25 వేల టీచర్‌ పోస్టుల ఖాళీల భర్తీ గురించి మాట్లాడటంలేదు. విద్యా
రంగంపై, చిన్నారుల భవితపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా
పూర్తిస్థాయి చర్చకు సమయమివ్వాలి. అప్పటి వరకు నూతన విద్యావిధానం అమలు వాయిదా
వేయాలి. త్వరలో తెరవనున్న బడులను పూర్తి సురక్షితంగా నిర్వహించేందుకు తక్షణ
చర్యలు తీసుకోవాలి.