Coronavirus: ఇండియాలో కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాదా.. WHO అంచనా

Covid 19: ఇండియాలో కరోనా కేసులు, మరణాలు, 17 నెలల పరిస్థితులు అన్నీ గమనించాక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లోని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ (Dr Soumya Swaminathan) షాకింగ్ ప్రకటన చేశారు. ఏంటంటే… ఇండియాలో కరోనా… స్థానిక (endemicity) స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది అన్నారు. ఈ స్థాయికి చేరడం వల్లే తక్కువగా, చెప్పుకోతగ్గ స్థాయిలో వ్యాధి వ్యాపిస్తోందని తెలిపారు. ఈ ప్రకటన భారతీయులకు ఆందోళన కలిగించేదే. ఎందుకంటే… endemicity స్థాయి అనేది ఇబ్బందికరమైనది. ఏదైనా వ్యాధి విదేశాల నుంచి వస్తే… అది కొన్నాళ్లకు వెళ్లిపోతుంది. దానితో సమస్య కొంతకాలమే ఉంటుంది. అలా కాకుండా… ఇలా స్థానిక స్థాయికి చేరితే… ఇక ఆ వ్యాధి ఎప్పటికీ పోదు. అలాగే ఉంటుంది. జలుబు, జ్వరం, దగ్గు ఎలాగైతే… రెగ్యులర్‌గా ఉంటాయో… అలాగే అదీ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. కరోనా (COVID 19) ఇక ఎప్పటికీ ఇండియాలో ఉంటుంది. దానితో మనం సహజీవనం చెయ్యక తప్పదు అన్నది డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెర్షన్ అనుకోవచ్చు.

కరోనా నిజంగానే ఇండియాలో స్థానిక స్థాయికి (endemic stage) చేరివుంటే… ఇక మనం దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలే తప్ప… అది లేని చోటు ఉంటుంది అనుకోలేం. కరోనాను మహమ్మరి (epidemic stage)గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గతేడాది ప్రకటించింది. అంటే… అది ఎక్కువ మంది ప్రజలకు సోకుతుందనీ, ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుందని అర్థం. ఆ ప్రకారమే… ఇండియా ఎపిడమిక్ స్టేజ్‌ని ఎప్పుడో దాటేసింది. అందుకే ఇప్పుడు స్థానిక స్థాయికి వచ్చేసిందని డాక్టర్ సౌమ్య అంటున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా… భారత్‌లో తయారైన భారత్ భయోటెక్ కంపెనీ హైదరాబాద్‌లో తయారుచేస్తున్న కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సిన్‌ని ఇప్పటివరకూ అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. దీనిపై ప్రశ్నించగా… WHO టెక్నికల్ గ్రూపు సంతృప్తిగా ఉందనీ… సెప్టెంబర్ మధ్య నాటికి అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉందని ఆమె తెలిపారు. ఈ అనుమతి ఇస్తేనే… ప్రపంచ దేశాలు దాన్ని వ్యాక్సిన్‌గా గుర్తిస్తాయి. అలాగే ఆ వ్యాక్సిన్ వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తాయి.

Flash...   IBPS CRP RRB XI Recruitment 2022 – 8106 Posts

ఇండియాలో ప్రస్తుతం కరోనా తక్కువగానే ఉందన్న సౌమ్య స్వామినాథన్… ఇదివరకటిలా భారీగా కేసులు రావట్లేదని అన్నారు. ఇది ఒకింత ఉపశమనం కలిగించే అంశంగా అభిప్రాయపడ్డారు. భారతీయులకు ఇమ్యూనిటీ వచ్చినట్లేనా అనే అంశంపై… ఇండియా చాలా పెద్ద దేశం కాబట్టి… అంతటా ఒకేలా ఉండే ఛాన్స్ లేదని ది వైర్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ కరణ్ థాపర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు సౌమ్య.

2022 చివరి నాటికి ప్రపంచ దేశాలు 70 శాతం ప్రజలకు వ్యాక్సిన్ వేయగలిగితే… అప్పుడు ఈ కరోనా అనేది చాలా వరకూ తగ్గిపోయి… ప్రజల జీవితాలు సాధారణ స్థితికి వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లలకు కరోనా సోకుతుందా అనే అంశంపై తల్లిదండ్రులు అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పిల్లలకు కూడా కరోనా సోకే ఛాన్స్ ఉన్నా… వారిలో లక్షణాలు పెద్దగా కనిపించట్లేదనీ, అలాగే జ్వరం వంటివి చాలా తక్కువ మందికే వస్తున్నాయని ఆమె తెలిపారు. ఐతే… ఆస్పత్రుల్లో మాత్రం పిల్లల కోసం రెడీగా అన్ని ఏర్పాట్లూ చేసుకోవడం మేలన్నారు. పిడియాట్రిక్ అడ్మిషన్లు, పిడియాట్రిక్ ICU వంటివి ముందుగానే సిద్ధంగా ఉంటే… తల్లిదండ్రుల్లో టెన్షన్ లేకుండా ఉంటుందని తెలిపారు.

థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఆమె… దానికి సిద్ధంగా ఉండాలన్నారు. మూడో డోస్ (Booster Dose) అనేది సైంటిఫిక్‌గా మంచి పద్ధతి కాదన్న ఆమె… ఈ విషయంలో తొందరపడటం మంచిది కాదన్నారు. రెండు డోసులకే సరిపెట్టడం మేలన్నారు. తద్వారా వ్యాక్సిన్లు అందని దేశాలకు అదనపు వ్యాక్సిన్లను సప్లై చేయవచ్చు అన్నారు