Covid third wave: థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో: సీఎం జగన్

అమరావతి: కరోనా  థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో  తెలియదని సీఎం జగన్ అన్నారు. స్పందన కార్యక్రమంలో కోవిడ్‌పై సీఎం జగన్ మాట్లాడారు. థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో తెలియదని, ఒక వేళ వస్తే మనమంతా సన్నద్ధంగా ఉండాలని అధికారులను జగన్ ఆదేశించారు. గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా మనమంతా కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో సగటున 1300 కేసులకు పడిపోయినప్పటికీ మనం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతం ఉన్నప్పటికీ  అందరం అప్రమత్తంగానే ఉండాలన్నారు. స్కూళ్లు ప్రారంభం అయ్యాయని, ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో పాటించాల్సిన ఎస్‌ఓపీలను విడుదల చేశామన్నారు. వాటిని అందరూ తప్పకుండా పాటించాలన్నారు.

విద్యాసంస్థల్లో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని టీచర్‌ చెబితే, మార్గదర్శకాల ప్రకారం అక్కడే  పరీక్షలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. విద్యార్థులతో పాటూ వారి తల్లిదండ్రులకు కూడా వెంటనే పరీక్షలు చేయాలన్నారు. థర్డ్‌ వేవ్‌ వస్తుందో, లేదో తెలియదని, దానికి మనమంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 71,03,996 మందికి డబుల్‌ డోస్, 1,18,53,028 మందికి సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్లు ఇచ్చామని ఆయన తెలిపారు. 85శాతం ప్రజలకు డబుల్‌ డోస్‌ ఇచ్చేంతవరకూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

వానాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్‌ గున్యా తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రం నుంచి ఏపీకి జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రావాల్సి ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కలెక్టర్లు, జాయంట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు తనిఖీలు చేయాలని ఆదేశించారు. వివిధ డిపార్టమెంట్ల పోస్టర్లు, వెల్ఫేర్‌ క్యాలెండర్లు, బయెమోట్రిక్‌ అటెండెంటెన్స్, రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణతోపాటు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల పనితీరును కూడా పర్యవేక్షణ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 

Flash...   G.O.RT.No. 193 Extension of the period of Director of School Education, A.P