ఖగోళ దృగ్విషయాలను ఛేదించడం కోసం నాసా ఎంతగానో కృషి చేస్తోంది. పలు టెలిస్కోప్‌లనుపయోగించి బ్లాక్ హోల్స్, సూపర్ నోవా, ఇతర గెలాక్సీల చిత్రాలను నాసా రిలీజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా చంద్రుడికి సంబంధించిన అరుదైన చిత్రాన్ని నాసా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. నాసా రిలీజ్ చేసిన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని కారణం చంద్రుడు చిత్రం ఎన్నడూ లేని విధంగా వింతగా ఇంద్రధనస్సులో ఉండే రంగుల మాదిరి ఉన్న చిత్రాన్ని నాసా రిలీజ్ చేసింది.
స్టోరీ ఏంటంటే…!
విభిన్న రంగుల్లో ఉన్న చంద్రుని చిత్రాన్ని గురించి నాసా వివరించింది. గురు గ్రహాన్ని, దాని ఉపగ్రహాలను స్టడీ చేయడం కోసం 1989 అక్టోబర్ 18న స్పేస్ షటిల్ అట్లాంటిస్ ఉపయోగించి గెలిలీయో శాటిలైట్‌ను నాసా ప్రయోగించింది. గెలిలీయో శాటిలైట్ ప్రోబ్ గురు గ్రహం వద్దకు సాగుతుండగా 1992 డిసెంబర్ 7న చంద్రుడి ఉత్తర ధృవాలను ఫోకస్ చేస్తూ 53 చిత్రాలను తీసింది. ఈ చిత్రాలను కలుపగా చంద్రుడి ఫాల్స్ కలర్డ్ మెజాయిక్ చిత్రాన్ని తీసింది. ఈ చిత్రాలను తొలిసారిగా నాసా అధికారికంగా సోషల్ మీడియా ఖాతాలో రిలీజ్ చేసింది.
అసలు ఏంటీ..! ఈ రంగురంగుల ప్రాంతాలు
పలు ప్రాంతాల్లో విభిన్న రంగులతో ఉన్న చంద్రుడి చిత్రాలను నాసా వివరించింది. పలు ప్రాంతాల్లో గులాబీ రంగులో ఉన్న ప్రాంతాలు చంద్రుడిపై ఉన్న ఎత్తైన ప్రాంతాలను సూచిస్తుంది. నీలం నుంచి నారింజ షేడ్స్ రంగులు చంద్రుడిపై ఉన్న పురాతన లావా వెదజల్లిన ప్రాంతాలను సూచిస్తుంది. ముదురునీలం రంగు ప్రాంతంలో అపోలో-11 వ్యోమనౌక చంద్రుడిపై ల్యాండయ్యింది. లేత నీలం రంగు చంద్రుడిపై ఉన్న ఖనిజాలను చూపిస్తోంది.