రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ రుసుము మినహాయింపు
యోనో యాప్ ద్వారా దరఖాస్తుకు అదనపు రాయితీలు
ముంబై: పండగ సీజన్ ప్రారంభం కానున్న సందర్భంగా రిటైల్ కస్టమర్ల కోసం ఎస్‌బీఐ పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కార్ లోన్ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్ రుసుము మినహాయింపుతోపాటు వాహనం ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు రుణం పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఎస్‌బీఐకి చెందిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘యోనో’ ద్వారా కార్ లోన్‌కు దరఖాస్తు చేసుకునేవారికి రుణ వడ్డీపై 0.25 శాతం రాయితీ కూడా లభించనుంది. యోనో వినియోగదారులకు కార్‌లోన్‌పై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతుంది. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో బ్యాంక్ పేర్కొన్న మరిన్ని ఆఫర్ల వివరాలు..
బంగారం తాకట్టు రుణాలపై వడ్డీలో 0.75 శాతం రాయితీ. అన్ని చానెళ్ల (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్) ద్వారా గోల్డ్ లోన్‌ను 7.5 శాతం వార్షిక వడ్డీ రేటుకే పొందే సౌలభ్యం. యోనో యాప్ ద్వారా గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు ప్రాసెసింగ్ రుసుము పూర్తిగా మినహాయింపు.
వ్యక్తిగత, పెన్షన్ రుణగ్రహీతలకు ప్రాసెసింగ్ రుసుము 100 శాతం మినహాయింపు. ఏ మార్గంలో దరఖాస్తు చేసుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్‌కు వ్యక్తిగత రుణ వడ్డీలో 0.50 శాతం ప్రత్యేక రాయితీ. కొవిడ్ వారియర్స్‌కు కార్ లోన్, గోల్డ్ లోన్‌పైనా ఈ ఆఫర్ త్వరలో వర్తింపు.
ఈనెల 31 వరకు గృహ రుణాలపై 100 ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపును బ్యాంక్ గతనెలలోనే ప్రకటించింది. ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ రేటు 6.70 శాతం నుంచి ప్రారంభమవుతుంది.
దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లయిన సందర్భంగా రిటైల్ డిపాజిట్‌దారుల కోసం ‘ప్లాటినమ్ టర్మ్ డిపాజిట్’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా, 75 రోజులు, 75 వారాలు, 75 నెలల కాలపరిమితి డిపాజిట్‌పై 0.15 శాతం అదనపు వడ్డీ ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఈనెల 15 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ టర్మ్ డిపాజిట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. Read more..