2001 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యం కోసం పెట్టుబడులు పెట్టింది. విలువైన, అధునాతనమైన ఆయుధాలు సమకూర్చింది. అయినప్పటికీ కేవలం 11 రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలు తాలిబన్లకు లొంగిపోయారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. మూడు లక్షలకు పైగా ఆఫ్ఘన్ సేనలు ఉన్నాయని, వారంతా బలంగా ఉన్నారని, అమెరికా సైన్యం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దానికి, అక్కడ ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. సైన్యంలో జరిగిన భారీ అవినీతే ఆఫ్ఘన్ సేనల ఓటమికి ప్రధాన కారణమని చెబుతున్నారు.
సైనికులకు పై స్థాయి అధికారులు కనీసం జీతాలు కూడా సరిగా ఇచ్చేవారు కాదని, చాలా ప్రాంతాల్లో కనీసం సైనికులకు సరైన ఆహారం కూడా లేదని, దీంతో సైనికులు తమ ఆయుధాలను తాలిబన్లకు ఇచ్చి ఆహారం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. తాలిబన్‌లతో జరిగిన పోరాటంలో ఎంత మంది మరణించారు, ఎంత మంది ఉన్నారు అనే లెక్కలు కూడా స్పష్టంగా లేవని, సైనికాధికారుల అవినీతి కారణంగానే ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయిందని నివేదికలు చెబుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉండాల్సిన సైనికుల్లో కనీసం పదిశాతం మంది సైనికులు కూడా లేరని అంటే అక్కడ అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకొవచ్చు.