గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ అప్పర్ ప్రైమరీ చదువుతున్నారు. కటిహార్ జిల్లాలోని బగౌరా పంచాయతీలోని పస్తియ గ్రామంలో ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ పిల్లల యూనిఫారమ్స్ కోసం కొంత మొత్తం విద్యార్థుల ఖాతాల్లో జమచేసింది. ఆ డబ్బు తమ ఎకౌంట్లలో పడిందో లేదో చూసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన లోకల్ ప్రాసెసింగ్ సెంటర్ కు వెళ్లారు. అప్పుడు తెలిసింది వాళ్ల ఖాతాల్లో వందల కోట్లలో డబ్బు ఉందనే విషయం.
విశ్వాస్ ఖాతాలో 60 కోట్లు, కుమార్ ఖాతాలో ఏకంగా 900 కోట్ల రూపాయల డబ్బు జమ అయి ఉంది. ఈ విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, మొత్తం గ్రామం ఆశ్చర్యపోయింది. బ్యాంక్ మేనేజర్ మనోజ్ గుప్తా కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకొని విద్యార్థుల రెండు ఖాతాల్ని ఫ్రీజ్ చేశాడు. విషయాన్ని ఉన్నత అధికారులకు చేరవేశారు. కేవలం సాంకేతిక లోపం వల్లనే ఇలా జరిగినట్టు గుర్తించారు.
సరిగ్గా 2 రోజుల కిందట ఖగారియా జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ టీచర్ ఖాతాలో 5.5 లక్షలు జమ అయ్యాయి. వాటిలోంచి అతడు లక్షా 61వేల రూపాయలు ఖర్చు చేశాడు కూడా. తర్వాత ఆ సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందిగా బ్యాంక్ అతడికి నోటీసులిచ్చినప్పటికీ అతడు వినలేదు.
లాక్ డౌన్ వల్ల మోడీ తన ఖాతాలో ఆ మొత్తం వేశారని, తను వెనక్కి ఇవ్వనని మొండికేశాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
——–
PM Modi: మోదీ వేసిన డబ్బులవి.. నేనివ్వను
పొరపాటున ఖాతాలో జమైన మొత్తం ఇచ్చేందుకు నిరాకరణ
చివరకు కటకటాల పాలైన బిహార్ వ్యక్తి
బిహార్: పొరపాటున బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.5.5 లక్షల మొత్తాన్ని వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిన బిహార్ వ్యక్తి ఒకరు కటకటాల పాలయ్యారు. ఆ డబ్బులు ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన రూ.15 లక్షల మొత్తానికి సంబంధించినవిగా భావించానని, అందుకే ఖర్చు పెట్టుకున్నానంటూ అతను చెప్పడంతో ఆశ్చర్యపోవడం బ్యాంకు అధికారుల వంతైంది. బిహార్‌లోని ఖాగడియా జిల్లా భక్తియార్‌పుర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్‌కు స్థానిక గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఇటీవల బ్యాంకు అధికారుల పొరపాటు కారణంగా రంజిత్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. అతను వెంటనే ఆ మొత్తాన్ని తీసేసుకుని ఖర్చు పెట్టేసుకున్నాడు. అనంతరం పొరపాటును గుర్తించిన అధికారులు డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరారు. ఇందుకు రంజిత్ నిరాకరించాడు.
మార్చిలో నా ఖాతాలో నగదు డిపాజిట్ అయినప్పుడు నేను చాలా సంతోషించా. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పారు. అందులో భాగంగానే నా ఖాతాలో మొదటి విడత కింద నగదు జమ అయినట్లు భావించాను. డబ్బు మొత్తం ఖర్చు చేశాను. ఇప్పుడు నా ఖాతాలో డబ్బులు లేవు’’ అని ఖాతాదారుడు చెబుతున్నాడని బ్యాంకు మేనేజర్ సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. రంజిత్ దాస్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించామని మాన్సీ ఎస్‌హెచ్‌వో దీపక్ కుమార్ చెప్పారు.