Google Voice Assistant: ఇకమీదట హేయ్‌ గూగుల్.. ఓకే గూగుల్ అనక్కర్లేదు!

 Google Voice Assistant: ఇకమీదట హేయ్‌ గూగుల్.. ఓకే గూగుల్ అనక్కర్లేదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మెనూ ఐకాన్‌ లేదా ఫోన్ చివరన మధ్యలో ట్యాప్‌ చేసి ‘హేయ్‌ గూగుల్’ లేదా ‘ఓకే గూగుల్’  అనగానే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ప్రత్యక్షమవుతుంది. తర్వాత మీరు ఇచ్చిన కమాండ్‌ ఆధారంగా మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. అయితే మీరు చెప్పిన పని గూగుల్ చేయాలంటే కమాండ్‌కి ముందు ‘ఓకే గూగుల్’ లేదా ‘హేయ్ గూగుల్’ అనడం తప్పనిసరి. అవి లేకుండా గూగుల్ వాయిస్‌ అసిస్టెంట్ మీ కమాండ్‌ని స్వీకరించదు. త్వరలో ఈ వాయిస్‌ కమాండ్స్‌ అవసరం లేకుండా గూగుల్ ‘క్విక్‌ ఫ్రేజెస్’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ మేరకు గూగుల్ వాయిస్‌ అసిస్టెంట్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లోనే దీనికి సంబంధించిన సమాచారం బయటికి వచ్చినప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. కొత్తగా తీసుకొస్తున్న ఈ ఫీచర్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌ సేవల కోసం డైరెక్టుగా మనకు అవసరమైన కమాండ్ ఇస్తే సరిపోతుంది. ఉదాహరణకు.. మీరు అలారం సెట్ చేయాలి అనుకున్నారు. అందుకోసం ‘సెట్ ది అలారమ్‌’ అంటే సరిపోతుంది. గతంలో అయితే ‘సెట్‌ ది అలారమ్‌’కి ముందు ‘హేయ్ గూగుల్’ అని తప్పక చెప్పాల్సి వచ్చేది. ఇకమీదట ఆ అవసరం లేదు. ‘వాట్‌ ఈజ్‌ టైం నౌ’, ‘కాల్ హోం’, ‘వెదర్‌ అప్‌డేట్‌’ వంటి కమాండ్‌లు డైరెక్టుగా ఇచ్చేయ్యొచ్చు. ఇవేకాకుండా మరికొన్ని కమాండ్‌లను గూగుల్ క్విక్ ఫ్రేజెస్‌లో చేర్చనుంది. దీంతో యూజర్స్‌ సులవుగా వాయిస్ అసిస్టెంట్‌ని సేవలను ఉపయోగించుకోగలుగుతారని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Flash...   BOMB ALERT TO SCHOLS: పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిక.. కలకలం రేపిన ఘటన