జగన్ సర్కార్ చేసిన అప్పులివే: ఎన్ని లక్షల కోట్లంటే.. బుగ్గన సంచలన రిపోర్ట్!

 జగన్ సర్కార్ చేసిన అప్పులివే: ఎన్ని  లక్షల కోట్లంటే.. బుగ్గన సంచలన రిపోర్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి, జగన్ సర్కారు చేస్తున్న అప్పులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి లెక్కలు బయటపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో కరోనా కట్టడికి ఇప్పటి వరకు రూ.7,130 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పరిమితికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నట్టు స్పష్టం చేశారు

కరోనా వల్ల రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గలేదన్న ప్రతిపక్షాల వాదనలు అర్థరహితంగా ఉన్నాయని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు. ఏడాదిగా పన్ను పెరుగుదల లేక రూ. 7,947 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు వివరించారు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడంతో అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయని గుర్తు చేశారు.

ఇక, జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.27 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు. అలాగే, సీఎం జగన్ సీఎం అయినప్పటి నుంచి వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజల ఖాతాల్లో రూ.1.05 లక్షల కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. జీఎస్‌డీపీలో అదనంగా 2 శాతం అప్పు తీసుకొనేందుకు కేంద్రం అనుమతించిందని బుగ్గన గుర్తు చేశారు.

పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. పిల్లలకు చదువే అతి పెద్ద ఆస్తి అని.. వివిధ పథకాల కింద తల్లుల ఖాతాల్లో రూ.25,914.13 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అలాగే అవ్వాతాతలకు ఇంటింటికి రూ.37,461.89 కోట్లు పెన్షన్లు పంపిణీ చేశామని, అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత.. ఇలా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకున్నట్లు వివరించారు. అయితే అవాస్తవాలు, అసంబద్ధ ప్రచారాలతో ఒక వ్యూహం ప్రకారం టీడీపీ విషప్రచారం చేస్తోందని మంత్రి బుగ్గన మండిపడ్డారు.

Flash...   Diwali Sale: డిస్కౌంట్ల పండుగ .. ఆ కార్లపై ఏకంగా రూ. 3.5లక్షల వరకూ తగ్గింపు.. అవేంటంటే ..