ఏడాదికి రూ.లక్ష ఆదాయం!

 ➤వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది మహిళలకు లబ్ధి
చేకూర్చేలా కార్యక్రమాలు

 ➤వైవిధ్య జీవనోపాధి అవకాశాల కల్పన ద్వారా అందించేందుకు
ప్రణాళికలు

lakshapathi

సాక్షి, హైదరాబాద్‌: మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి
మంత్రిత్వ శాఖ మరిన్ని ప్రణాళికలు రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం
సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ఏడాదికి కనీసం రూ.లక్ష ఆదాయం వచ్చేటట్టు
చర్యలు చేపట్టనుంది. ఈ లక్ష్యసాధనకు ‘లక్షపతి ఎస్‌హెచ్‌జీ మహిళ’అనే సరికొత్త
కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

వైవిధ్యరంగాల్లో జీవనోపాధి అవకాశాల కల్పన ద్వారా స్వయంసమృద్ధిని సాధించడం దీని
ఉద్దేశం. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల గ్రామీణ మహిళలకు
లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఈ సంఘాలకు అవసరమైన సహకారం
అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి దేశంలో అమలవుతున్న వివిధ
కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను
జారీచేసింది.

ఇందులో భాగంగా బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్, ట్రాన్‌ఫర్మేషన్‌ రూరల్‌
ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధులు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో కలసి గత
బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. మహిళలకు
మరిన్ని జీవనోపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చే అంశాలపై
చర్చించారు.  

వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి 

వ్యవసాయం, అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి అంశాల
ద్వారా విభిన్న అవకాశాలను అందించి వార్షిక ఆదాయం కనీసం లక్ష రూపాయలు ఉండేలా
చూడాలని అధికారులు నిర్ణయించారు.

ఈ లక్ష్య సాధనకు స్వయంసహాయక బృందాలు, గ్రామీణ సంస్థలు, క్లస్టర్‌ స్థాయి
సమాఖ్యలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఈ లక్ష్యసాధనలో పౌర
సంఘాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర ప్రైవేట్‌ సంస్థల సహకారాన్ని
తీసుకోనున్నారు. రాష్ట్రాలు ఈ దిశలో ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించింది. 

గ్రామీణ మహిళలకు మద్దతుగా..

జాతీయ జీవనోపాధి మిషన్‌ ద్వారా 6,768 బ్లాకుల్లో 70 లక్షల స్వయం సహాయక బృందాల
ద్వారా 7.7 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ప్రారంభ పెట్టుబడిని
అందించడంతోపాటు ఈ బృందాలకు ప్రతి ఏడాది రూ.80 వేల కోట్ల నిధులను
సమకూరుస్తున్నారు. బ్యాంకుల నుంచి స్వయం సహాయక బృందాలు పెట్టుబడుల రూపంలో
తీసుకున్న రుణాలను జీవనోపాధి అవకాశాల మెరుగుకు ఉపయోగిస్తుండటంతో ఆశించిన
ఫలితాలు వస్తున్నాయి.

Flash...   Old Smart phone: పాత స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పడేయకండి.. ఇలా క్యాష్‌ చేసుకోండి..!

అయితే, గ్రామీణ ప్రాంత మహిళలు గౌరవప్రదంగా జీవించి సుస్థిర అభివృద్ధి
సాధించడానికి వారి వార్షిక ఆదాయం లక్ష రూపాయలుగా ఉండాలని కేంద్ర
గ్రామీణాభివృద్ధి శాఖ భావించింది. లక్ష అనేది శుభప్రదంగా, స్ఫూర్తి కల్పించే
విధంగా ఉంటుందని ‘లక్షపతి ఎస్‌హెచ్‌జీ మహిళ’కార్యక్రమానికి రూపకల్పన
చేసింది.