విద్యాదీవెన-తల్లులకు ఝలక్-మూడు వారాల్లో చెల్లించపోతే కాలేజీలకే

 విద్యాదీవెనపై జగన్ సర్కార్ మధ్యేమార్గం-తల్లులకు ఝలక్-మూడు వారాల్లో చెల్లించపోతే కాలేజీలకే.

 ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వం నుంచి ఫీజులు తీసుకుని వాటిని తిరిగి కాలేజీలకు చెల్లించకుండా దాదాపు 40 శాతం మంది తల్లులు వాడేసుకోవడంతో మొదలైన వివాదం కాస్తా హైకోర్టుకు చేరి ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తల్లుల నుంచి ఎలాగైనా ఫీజులు ఇప్పిస్తామని చెప్పినా హైకోర్టు నమ్మలేదు. చివరికి కాలేజీలకే ఫీజులు ఇవ్వాలని తేల్చి చెప్పేసింది దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ వివాద పరిష్కారానికి హైకోర్టుకు మధ్యేమార్గం ప్రతిపాదించింది.

జగనన్న విద్యా దీవెన ఏపీలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన బడుగు, బలహీన వర్గాల ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ఆ తర్వాత పలుపేర్లు మార్చుకుని జగనన్న విద్యాదీవెనగా ప్రస్తుతం అమలవుతోంది. ఇందులో భాగంగా అర్హులైన బడుగు, బలహీనవర్గాల విద్యార్ధుల ఫీజుల్ని వారి తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు. గతంలో నేరుగా కాలేజీలకే ఈ ఫీజులు చెల్లించగా.. వైసీపీ ప్రభుత్వం మాత్రం తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో వీటి దుర్వినియోగం మొదలైంది. కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులు కాస్తా కొందరు తల్లులు సొంత అవసరాలకు వాడేసుకోవడంతో వివాదం మొదలైంది. ఇది కాస్తా హైకోర్టుకు చేరింది. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు.. ఫీజుల్ని కాలేజీల ఖాతాల్లో వేయడమే సమంజసమని తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పును రిజర్వు చేసింది.

సమీక్షఅవసరం లేదన్న హైకోర్టు 

జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ప్రభుత్వం చెల్లించే ఫీజుల్ని తల్లుల ఖాతాలకు వేయడం ద్వారా అవి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని గతంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కాబట్టి వాటిని అంతిమంగా చేరల్సిన కాలేజీల ఖాతాల్లోనే వేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తమ గత తీర్పును సమీక్షించాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. తమ తీర్పును సమీక్షించడానికి తగిన కారణాలు కనిపించడం లేదని తెలిపింది. గతంలో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వం సవరణలు కోరడం సరికాదని డిఫెన్స్ కూడా వాదించింది.

Flash...   How to install and access JVK Mobile app

సర్కార్ మధ్యేమార్గం 

ఓవైపు తల్లుల ఖాతాల్లో వేస్తున్న విద్యాదీవెన ఫీజు మొత్తాల దుర్వినియోగం, మరోవైపు కాలేజీల ఖాతాల్లోనే వేయాలన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఇరుకునపడింది. దీంతో మధ్యేమార్గంగా ఈ ఫీజుల్ని ఎలాగైనా కాలేజీల ఖాతాల్లో వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇందులో భాగంగా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన మొత్తాలు జమ అయిన మూడు వారాల్లోగా కాలేజీలకు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టుకు తెలిపింది. అంటే ప్రభుత్వం ఫీజులు జమ చేసిన మూడు వారాల్లోగా అవి కాలేజీలకు చేరకపోతే యాజమాన్యాలే వాటిని రాబట్టుకునేందుకు అవకాశం కల్పించబోతున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆ తల్లులకు ఝలక్ 

ప్రభుత్వం నుంచి జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా తమ పిల్లల ఫీజులు తీసుకుంటూ వాటిని కాలేజీల ఖాతాల్లో జమ చేయకుండా సొంతఅవసరాలకు వాడేసుకుంటున్న తల్లులకు ప్రభుత్వం వరుసగా ఝలక్ లు ఇస్తోంది. ఇప్పటికే అలా వాడేసుకున్న తల్లులకు మరో విడత ఫీజులు జమ చేయబోమని తేల్చిచెప్పిన ప్రభుత్వం.. ఇఫ్పుడు హైకోర్టుకు మరో హామీ ఇచ్చింది. ఇందులో మూడు వారాల్లోగా వాటిని కాలేజీలకు చెల్లించకపోతే రాబట్టుకునే హక్కును కాలేజీలకు కట్టబెడుతోంది. దీంతో ఇలా ప్రభుత్వ ఉద్దేశాన్ని అపహాస్యం చేస్తున్న తల్లులకు మరో ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే హైకోర్టు తుది తీర్పు ప్రకారమే ఈ నిర్ణయాలు ఆధారపడి ఉండబోతున్నాయి. హైకోర్టు ఒప్పుకోకపోతే ఈ నిర్ణయం అమలు చేసేందుకు కూడా ప్రభుత్వానికి అవకాశం ఉండదు.