టీచర్లతో మరుగుదొడ్లు కడిగిస్తారా?

టీచర్లతో మరుగుదొడ్లు కడిగిస్తారా?

చదువు తప్ప అన్ని పనులూ చేయిస్తున్నారు: హైకోర్టు ఆగ్రహం

AP-high-court 

  ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లను ఉపాధ్యాయులతో కడిగించడం పట్ల
హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులతో చదువు చెప్పించడం తప్ప
మిగతా పనులన్నీ చేయుస్తున్నారని మండిపడింది. విద్యా వ్యవస్థను నాశనం చేశారని
నిప్పులు చెరిగింది. మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు వరుసలో నిల్చునేలా
చూసే బాధ్యతను టీచర్లకు అప్పగించారని హైకోర్టు గుర్తు చేసింది. పాఠశాలల
మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా? లేవా? అనే విషయంపై ఫొటోలు తీసి ప్రతి రోజు
ప్రభుత్వ యాప్‌లో అప్‌లోడ్‌ చేసే బాధ్యతను వారికే అప్పగించారని
ఆక్షేపించింది. భోజన పథకం పర్యవేక్షణ, ఫొటోలు అప్‌లోడ్‌ చేసే బాధ్యతలను
వారికే ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇది తీవ్రమైన వ్యవహారమని.. ఉపాధ్యాయుల
సేవలను చదువు చెప్పేందుకు సద్వినియోగం చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి
సూచించాలని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌కు స్పష్టం చేసింది. పాఠశాలల ఆవరణల్లో
గ్రామసచివాలయాలు తొలగించాలంటూ ఇచ్చిన తీర్పును ఏమేరకు అమలు చేశారో సమగ్ర
నివేదికను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల
15కి వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం
ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో గ్రామసచివాలయాలు తొలగించాలని జారీ
చేసిన ఆదేశాల్ని అధికారులు పట్టించుకోకపోవడంతో హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన
కోర్టు ధిక్కరణ కేసు సోమవారం విచారణకు వచ్చింది.

Flash...   G.O.MS.No.37 : Suppression of 4764 SGT Posts 397 Posts in each district for AP Model School