ఫ్లైట్లను తక్షణమే నిలిపేయండి.. ప్రధానికి ఢిల్లీ సీఎం లేఖ
న్యూఢిల్లీ: ఆఫ్రికాలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో ప్రవేశించకముందే దాని ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి విమానాల రాకపోకలను నిషేధించాలని ఆ లేఖలో కోరారు. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా పరిస్థితి చేయిదాటిపోయి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘గత ఏడాదిన్నర కాలంగా మన దేశం కరోనా మహమ్మారితో పోరాడింది. లక్షలాది మంది కొవిడ్ వారియర్స్ నిస్వార్థ సేవతో ప్రస్తుతం మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్నాం. ఇప్పుడు ఒమిక్రాన్ అనే కొత్త రకం కరోనా వేరియంట్ కలకలం రేపుతున్నది. ప్రమాదకరంగా విస్తరిస్తున్న దాన్ని దేశంలోకి రాకుండా నిలువరించడానికి తక్షణమే చర్యలు చేపట్టాలి. ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు విమానాల రాకపోకలను నిషేధించాలి. లేదంటే ఒమిక్రాన్ సోకిన ఒక్క వ్యక్తి దేశంలోకి వచ్చినా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది’ అని కేజ్రివాల్ తన లేఖలో పేర్కొన్నారు.