Password | మీ పాస్‌వర్డ్ హ్యాకర్లకు తెలిసిపోయిందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి..
ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ను ఉపయోగించడం సులువే ! కానీ మన వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల బారిన పడకుండా చూసుకోవడమే కష్టం !! బ్యాంకు అకౌంట్లతో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అంటూ రకరకాల సోషల్ మీడియా అకౌంట్లు ఉండటంతో అన్ని పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోలేక.. చాలామంది ఒకేరకమైన పాస్‌వర్డ్‌లను అన్నింటికీ పెడుతున్నారు. గుర్తుండాలని ఈజీ పాస్‌వర్డ్‌లు పెడుతున్నారు సరే.. మరి అవి సురక్షితంగా ఉన్నాయా? లేదా ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాయా? అన్న విషయం మీకు తెలుసా ! తెలియదు కదూ !! మరి మీ పాస్‌వర్డ్ హ్యాకర్ల బారిన పడిందో లేదో ఎలాగో తెలుసుకోవాలని ఉందా !! దీనికోసం గూగుల్ క్రోమ్ ( Google chrome ) లో ఒక ఫీచర్ ఉంది. దీని ద్వారా అసలు మీ పాస్‌వర్డ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అన్న విషయం తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పడు చూద్దాం..
గూగుల్ క్రోమ్‌లో ఉన్న ఆ ఫీచర్ ఏంటి?
మీ పాస్‌వర్డ్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకునేందుకు గూగుల్ క్రోమ్ ( Google chrome ) బ్రౌజర్‌లో ఒక సదుపాయం ఉంది. ఇది డెస్క్‌టాప్ బ్రౌజర్, మొబైల్ బ్రౌజర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా మీ పాస్‌వర్డ్ హ్యాకింగ్‌కు గురైందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్ క్రోమ్‌లో మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. అంతేకాకుండా ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు.. బ్యాంకు ఖాతాలు గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి. వాటి పాస్‌వర్డ్‌లను గూగుల్ ఖాతాలో సేవ్ చేయడం తప్పనిసరి.
పాస్‌వర్డ్‌ను ఎలా చెక్ చేయాలి?
ముందుగా క్రోమ్ బ్రౌజర్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
సెట్టింగ్స్ పేజిలోకి వెళ్లిన తర్వాత ఎడమ వైపు ఉన్న ఆప్షన్లలో ఆటో ఫిల్‌ను ఎంచుకోవాలి
ఆ తర్వాత పాస్‌వర్డ్ ఆప్షన్‌లోని చెక్ పాస్‌వర్డ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
అప్పుడు మీ అకౌంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను గూగుల్ క్రోమ్ సర్వర్‌కు పంపి విశ్లేషిస్తుంది.
పాస్‌వర్డ్ బలహీనంగా ఉంటే మార్చుకోమని సూచిస్తుంది.
ఎప్పుడైనా కొత్త ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయినా కూడా క్రోమ్ బ్రౌజర్ అప్రమత్తం చేస్తుంది.
హ్యాకింగ్ బారిన పడొద్దంటే ఏం చేయాలి
హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలంటే పాస్‌వర్డ్‌ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
తరచూ పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి
గతంలో ఒకసారి ఉపయోగించిన పాస్‌వర్డ్‌ను మరోసారి ఉపయోగించవద్దు
సులువుగా అంచనా వేసేలా నంబర్లు, పేర్లను పెట్టుకోవద్దు
అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్ కాకుండా వేర్వేరుగా పెట్టుకోవాలి
పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ కూడా అక్షరాలు, సింబల్స్, నంబర్ల కాంబినేషన్‌లో పెట్టుకోవడం మంచిది.