NORO VIRUS: నోరో వైరస్‌ అంటే ఏంటి? ఎలా వ్యాపిస్తుంది..లక్షణాలు, చికిత్స

 నోరో వైరస్‌ అంటే ఏంటి? ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు, చికిత్స పూర్తివివరాలు

కరోనా వైరస్ కాస్త తగ్గుతుంది అనుకునే లోపు కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వైరస్ తో ప్రజలు మళ్లీ భయాందోళన చెందుతున్నారు. అత్యంత వేగంగా వ్యాపించగలిగే నోరో వైరస్‌ ఇటీవల కేరళలో బయటపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఒక వెటర్నరీ కళాశాల విద్యార్థులకు ఈ వైరస్ సోకిందని, వారికి చికిత్స అందించామని కేరళ వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ వైరస్‌ శీతాకాలంలో ఎక్కువగా వ్యాపిస్తుందట. అసలు నోరో వైరస్ అంటే ఏంటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలు, చికిత్స వంటి వాటిపై తెలుసుకుందాం.

నోరో వైరస్ అంటే ఏంటి?

నోరో వైరస్‌ను వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం.. కలుషితమైన నీరు, ఆహారమే. ఈ వైరస్ సోకిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడతారు. ఈ అంటువ్యాధి వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటుందట. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైన ఉపరితలాలను తాకిన వారికి ఇది సులభంగా వ్యాపిస్తుంది.అచ్చం కరోనా లానే.. అయితే.. చాలామంది రెండు, మూడు రోజుల్లోనే కోలుకుంటారట.

ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత?

కరోనా వైరస్ అయితే బాడీలోకి వచ్చాక..లక్షణాలు చూపించటానికి 3నుంచి4 రోజులు సమయం పడుతుంది..కానీ ఈ వైరస్ సంక్రమించిన 12 నుంచి 48 గంటలలోపు లక్షణాలు ప్రారంభమవుతాయి. అంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 12- 48 గంటల వరకు ఉంటుందనమాట.


లక్షణాలు ఎలా ఉంటాయి.

అనారోగ్యంగా లేదా వికారంగా అనిపించడం,

అతిసారం (డయేరియా), వాంతులు.. వంటివి కనిపిస్తాయి.

శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం.

తలనొప్పి, ఒంటి నొప్పులు.


చికిత్స ఏంటి?

నోరో వైరస్ బాధితుల్లో చాలామంది ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారు. అయితే వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం చికిత్స తప్పనిసరిగా కావాలి. బాధితులు డీహైడ్రేషన్‌ బారిన పడకుండా నివారించడానికి ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడంతో పాటు విశ్రాంతి తీసుకోవాలి. అయితే దీని వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండటం వల్ల, లక్షణాలు ఆగిపోయిన 48 గంటల వరకు బాధితులు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Flash...   కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. రష్యా కీలక ప్రకటన

నోరోవైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


ఈ వైరస్ కూడా కరోనాకు తీసుకునే జాగ్రత్తలే తీసుకోవాలి. చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. ఆల్కహాల్ బేస్డ్ జెల్స్ నోరోవైరస్‌ను నిర్వీర్యం చేయలేవు. ఎవరిలోనైనా వైరస్ బయపడితే.. వెంటనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అన్ని ఉపరితలాలను పూర్తిగా శుభ్రం చేయాలి.


వైరస్ తగ్గిన తర్వాత కూడా బాధితులు వంటచేయటం మంచిది కాదు. బాధితులు ఉపయోగించిన దుస్తులను 60 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే నీరు, డిటర్జెంట్ సాయంతో శుభ్రం చేసుకోవచ్చు.