మరేం భయం లేదు.. ‘ఒమిక్రాన్’ అంత ప్రమాదకరం కాదు: యూకే శాస్త్రవేత్త
లండన్: ఒమిక్రాన్ అందరూ ఊహిస్తున్నంత ప్రమాదకరమైనది కాదని యూకే శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. కోవిడ్‌వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ వేరియెంట్ నుంచి రక్షణ పొందే అవకాశాలున్నాయని బ్రిటన్ ప్రభుత్వానికి కరోనాపై సలహాలు ఇచ్చే మైక్రోబయోలాజిస్ట్ ప్రొఫెసర్ కేలమ్ సెంపుల్ వెల్లడించారు. ఈ కొత్త వేరియెంట్‌తో తలనొప్పి, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటివి వస్తాయే తప్ప ఆస్పత్రిలో చేరే అవకాశాలు, మరణాలు సంభవించడం వంటివి జరిగే అవకాశం తక్కువేనన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి, గతంలో కరోనా సోకడం వల్ల ఇమ్యూనిటీ వచ్చిన వారికి ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి ముప్పు ఉండదని సెంపుల్ అభిప్రాయపడ్డారు.
స్వల్ప లక్షణాలే: దక్షిణాఫ్రికా
ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా∙బయటపడుతున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్‌అసోసియేషన్ చైర్‌పర్సన్ ఏంజిలిక్యూ కాట్జీ చెప్పారు. ప్రస్తుతానికి కోవిడ్ రోగుల్ని ఇంట్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్ ద్వారా బయటపడలేదని ఆమె చెప్పారు. ‘ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. కేసులు అత్యధికంగానే బయట పడుతున్నాయి. అయితే ఆస్పత్రులపై భారం పడడం లేదు. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, వ్యాక్సిన్ తీసుకోని వారే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇంతవరకు ఈ వేరియెంట్ సోకలేదు. ఎంత ప్రమాదకరమో సంపూర్ణ అవగాహన రావాలంటే మరో 15 రోజులు పడుతుంది’ అని వివరించారు