OMICRON హెచ్చరికలతో AP సర్కార్ అలర్ట్.. CM జగన్ కీలక వ్యాఖ్యలు

 ఒమిక్రాన్ హెచ్చరికలతో ఏపీ సర్కార్ అలర్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ టెన్షన్ పెడుతోంది. కేంద్రం కూడా అప్రమత్తమైంది.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇటు ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని.. వ్యాక్సినేషన్‌లో వెనకబడిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. డోర్‌ టూ డోర్‌ వ్యాక్సినేషన్, క్రమం తప్పకుండా ఫీవర్‌ సర్వే చేపట్టాలని సూచించారు.

చదవండి:‘ఒమిక్రాన్‌’ అంత ప్రమాదకరం కాదు: యూకే శాస్త్రవేత్త

ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో స్పెషల్‌ మెడికల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ చేయాలి. ర్యాపిడ్‌ టెస్టులు కాకుండా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు మాత్రమే నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో అందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు చేపట్టి మళ్లీ స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. గతంలో ఉన్న నిబంధనలు అమలు చేసి.. ప్రజలు గుమిగూడకుండా చూడాలన్నారు. గతంలో కోవిడ్‌ చికిత్స కోసం వినియోగించిన అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైప్‌లైన్లు.. డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా చూసుకోవాలన్నారు.

రాష్ట్రంలో ప్రజలకు ఏ అనారోగ్య సమస్య ఉంటే 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలి అన్నారు సీఎం. క్వారంటైన్‌ సెంటర్స్, కోవిడ్‌ కేర్‌ సెంటర్స్, కోవిడ్‌ కాల్‌ సెంటర్లను పరిశీలించండి. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మరింత మ్యుటేషన్లు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ వేరియంట్‌ను గుర్తించేందుకు జీనోమిక్‌ సీక్వెన్స్‌ కోసం రోజూ 15 శాతం శాంపిళ్లను సీసీఎంబీకి పంపుతున్నట్లు చెప్పారు. త్వరలోనే విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ అందుబాటులోకి రానుందన్నారు.

చదవండి: వణుకు పుట్టిస్తున్న 2022 బ్రహ్మం గారి కాలజ్ఞానం.

కేంద్రం సూచనలతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి 12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు వివరించారు. ఒమిక్రాన్‌ హెచ్చరికలతో ఈ వైరస్ గుర్తించిన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా మళ్లీ వారం తర్వాత పరీక్ష చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటివరకు వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా గమనించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Flash...   AP NEW CABINET 2.0: AP మంత్రులకు శాఖల కేటాయింపులు