Rain Alert: ముంచుకోస్తున్న మరో ముప్పు..ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

 Rain Alert: వాతావరణశాఖ మరో హెచ్చరిక.. ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

 

అల్పపీడనం ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు, కర్ణాటక పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బంగాళాఖతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో 25 నుంచి 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడులో ఎల్లో అలర్ట్‌ కూడా జారీచేసింది. బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

నవంబర్ 25-27 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌, ఆంధ్ర ప్రదేశ్లోని కోస్తాఆంధ్రా రాయలసీమలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది. ఈ ద్రోణి మధ్యస్థ ఆవరణ స్థాయి వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరం వైపు కదులుతుందని తెలిపింది.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. జలప్రళయంతో చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పడిన మరో అల్పపీడనంతో ఏపీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Flash...   ఇప్పట్లో స్థానిక ఎన్నికలు కష్టం