Viveka Murder: వివేకా హత్యకేసు.. వీడిన మిస్టరీ

 Viveka Murder: వివేకా హత్యకేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన దస్తగిరి

కడప: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారినట్టు కడప సబ్‌ కోర్టులో దస్తగిరి పేరిట సీబీఐ అప్రూవర్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు సూచన మేరకు దస్తగిరి వాంగ్మూల పత్రాలను సీబీఐ న్యాయవాదులకు ఇచ్చింది. నేర అంగీకార పత్రాల్లో దస్తగిరి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించాడు.

‘‘వివేకా హత్యలో సునీల్‌, ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి, నేను పాల్గొన్నాం. ఆర్థిక లావాదేవీలతోనే హత్య జరిగింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. ఎర్రగంగిరెడ్డి మోసం వల్లే ఓడిపోయానని వివేకాకు ఆగ్రహం. బెంగళూరు స్థలంపై పంచాయితీకి పలుమార్లు వివేకా వెళ్లేవారు. స్థలంలో ఎర్రగంగిరెడ్డి వాటా అడిగితే వివేకా ఆగ్రహించారు. 2018లో నేను వివేకా వద్ద పని మానేశాను. ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ను కలిసేవాడిని. 2019 ఫిబ్రవరి 2న సునీల్‌ యాదవ్‌ను, ఉమాశంకర్‌రెడ్డిని, నన్ను, ఎర్రగంగిరెడ్డి తన ఇంటికి తీసుకెళ్లారు. వివేకాను చంపాలని ఎర్రగంగిరెడ్డి నాకు సూచించారు. వివేకాను హత్య చేయలేనని చెప్పా. హత్య చేసేందుకు తామూ వస్తామన్నారు. వివేకా హత్య వెనక పెద్దల ప్రమేయం ఉందన్నారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శంకర్‌ రెడ్డి ఉన్నారన్నాడు. శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని, అందులో రూ.5కోట్లు నాకు ఇస్తానని ఎర్రగంగిరెడ్డి చెప్పాడు.

ఇలా జరిగిన 4 రోజులకు సునీల్‌ యాదవ్‌ నాకు రూ.కోటి ఇచ్చాడు. రూ.25 లక్షలు తనకివ్వాలని.. తర్వాత ఇస్తానని సునీల్‌ చెప్పాడు. రూ.75 లక్షలు మున్నా అనే వ్యక్తి వద్ద దాచి ఉంచా. సునీల్‌, ఉమాశంకర్‌.. వివేకా ఇంటికుక్కను కారుతో ఢీకొట్టి చంపారు.నేను కదిరి వెళ్లి గొడ్డలి కొని సునీల్‌ యాదవ్‌కు ఇచ్చా. మార్చి 14న ఎర్రగంగిరెడ్డి,సునీల్‌,ఉమాశంకర్‌,నేను వివేకా ఇంటికి వెళ్లాం. ముందుగా ఎర్రగంగిరెడ్డి వివేకా ఇంట్లోకి వెళ్లాడు. తర్వాత మేం ముగ్గురం గోడదూకి లోపలికి వెళ్లాం. బెంగళూరు స్థలంలో వివేకాను ఎర్రగంగిరెడ్డి వాటా అడిగారు. వాగ్వాదం జరిగి సునీల్‌ బూతులు తిడుతూ వివేకా ముఖంపై కొట్టాడు. కిందపడిన వివేకాపై ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. గొడ్డలితో దాడి చేసి ఆయన చేత్తో లేఖ రాయించాం. సునీల్‌, ఉమాశంకర్‌.. వివేకా ఇంట్లో కొన్ని పత్రాలు తీసుకున్నారు. ఆ తర్వాత స్నానాల గదిలోకి తీసుకెళ్లి వివేకాను గొడ్డలితో నరికి చంపారు. వివేకాను హత్యచేశాక అందరం గోడదూకి పారిపోయాం’’ అని సెక్షన్‌ 164 స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వివరాలు వెల్లడించాడు. ఆగస్టు 30న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. (source:eenadu)

Flash...   పదో తరగతి EXAMS షెడ్యూల్ ప్రకారమే. మంత్రి ఆదిమూలపు సురేశ్